18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా ఏపీలో తిరుపతి ఎంపీగా డాక్టర్ మద్దిల గురుమూర్తి గెలుపు అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గెలుపు ఓ అద్భుతం. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు.
కానీ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తన సమీప కూటమి అభ్యర్థి వరప్రసాద్‌పై 14 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 1.40 లక్షల ఓట్ల క్రాస్ ఓటింగ్ జరగడంతో కూటమి నేతలు షాక్ తిన్నారు. తిరుపతి ఎంపీగా ఇవాళ పార్లమెంట్లో మద్దిల గురుమూర్తి అనే నేను అంటూ తెలుగులో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
గతంలో ఉప ఎన్నికలో గురుమూర్తి తిరుపతి ఎంపీగా గెలుపొంది, అత్యున్నత చట్టసభలో అడుగు పెట్టారు. అతి సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చిన ఆయన, రెండున్నరేళ్ల పదవీ కాలంలో తిరుపతి పార్లమెంట్ ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొనేలా ప్రాజెక్టులను తీసుకొచ్చారు. అలాగే వైసీపీ కేడర్‌కు అందుబాటులో వుంటూ, వారికి కావాల్సిన పనుల్ని తన చేతనైన వరకూ చేశారనే మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే భారీగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో క్రాస్ ఓటింగ్ జరిగిందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.