ఆయన మౌన ముద్రలోకి వెళ్ళాడు …ఈయన వార్నింగ్ ఇచ్చాడు

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గం దాదాపు ప్రతిరోజూ వార్తల్లో ఉంటోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల తరువాత రాజకీయంగా కాపు సామాజిక వర్గం…

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గం దాదాపు ప్రతిరోజూ వార్తల్లో ఉంటోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల తరువాత రాజకీయంగా కాపు సామాజిక వర్గం ప్రధానమైంది. గెలుపోటములను ప్రభావితం చేయగల సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని టీడీపీ, వైసీపీ రాజకీయాలు చేస్తుండగా కాపులు కూడా రాజ్యాధికారం కోసం ఒక్కటవుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. పార్టీలకు అతీతంగా కాపు సామాజికవర్గం నాయకుల సమావేశాలు జరుగుతున్నాయి. చివరకు రాబోయే ఎన్నికల్లో కాపులు ఏ పార్టీ వైపు మొగ్గుతారో, ఏ పార్టీని అందలం ఎక్కించడంలో కీలక పాత్ర పోషిస్తారో ఇప్పుడే చెప్పలేం.

ఇదిలా ఉండగా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాపు ఉద్యమాన్ని (రిజర్వేషన్ కోసం) తీవ్రంగా నడిపి తునిలో రైలు తగలబడటానికి కారణమైన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మౌన ముద్రలోకి వెళ్లి చాలా ఏళ్లైపోయింది. బాబు పాలనలో ప్రతిరోజూ ముద్రగడ ఆందోళన వార్తలే. కాపు జాతికి సంబంధించిన అతిపెద్ద స‌మ‌స్య చ‌ర్చ‌కి వ‌చ్చిన ద‌శ‌లో జాతి కోసం నా ప్రాణాలు ఇస్తానంటూ భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌లు చేసిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం క‌న‌ప‌డ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు టిడిపి స‌ర్కారుపై ఒంటికాలిపై లేచిన ముద్ర‌గ‌డ…అదే జ‌గ‌న్ సీఎం కావ‌డంతో దీర్ఘ‌నిద్ర‌లోకి వెళ్లిపోవ‌డం స‌హ ఉద్య‌మ‌కారుల‌కు ఏం చేయాలో అంతుబ‌ట్ట‌టంలేదు.

కేంద్రం ఆర్థికంగా వెన‌క‌బ‌డిన వ‌ర్గాల‌కు ఇచ్చిన ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ చంద్ర‌బాబు అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇది కేసులు, వివాదాల‌లో ఉండ‌గానే టీడీపీ స‌ర్కారు దిగిపోయి వైసీపీ స‌ర్కారు వ‌చ్చింది. వైఎస్ జ‌గ‌న్ రెడ్డి సీఎం కాగానే టీడీపీ కాపుల‌కు ఇచ్చిన 5 శాతం రిజ‌ర్వేష‌న్లు ఎత్తేశారు. కానీ దీనిపై ముద్రగడ క‌నీసం ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేయలేదు. తాజాగా కేంద్రం కూడా కాపుల‌కి చంద్ర‌బాబు ఇచ్చిన 5 శాతం రిజ‌ర్వేష‌న్ చ‌ట్ట‌బ‌ద్ధ‌మేన‌ని, ఇది కొన‌సాగించాలా వ‌ద్దా అనేది రాష్ట్ర ప్ర‌భుత్వం ఇష్ట‌మ‌ని తేల్చేసింది. కాపుల‌కు టీడీపీ ఇచ్చిన 5 శాతం రిజ‌ర్వేష‌న్ ని వైసీపీ అమ‌లు చేసేందుకు ఒత్తిడి తీసుకురావాల్సిన ప‌ద్మ‌నాభం.. అసలు నోరు కూడా మెద‌ప‌కుండా మౌనం వ‌హించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

ఇదిలా ఉండగా ….మరో కాపు నేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా బలహీనులైనవారికి కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేయాలని సీఎం జగన్‌ను కోరారు. రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానం మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై డిసెంబర్ 31 వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామ జోగయ్య డెడ్ లైన్ విధించారు. లేకపోతే జనవరి 2 నుంచి నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. కేంద్రం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా, వాటిలో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ హయాంలో నిర్ణయించారని అన్నారు. 

బిల్లు గవర్నర్‌ ఆమోదం పొందే సమయానికి వైసీపీ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మూడేళ్లలో సీఎం జగన్‌ కాపులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈనెల 31 లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తాను నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హరిరామ జోగయ్య తెలిపారు. రాష్ట్రంలో కాపులకు సీఎం పదవి డిమాండ్ తో ఇప్పటికే ఆ సామాజిక వర్గం నేతలు పార్టీలపై ఒత్తిడి పెంచుతున్నారు. అయినా వైసీపీ కానీ, టీడీపీ కానీ కాపులకు సీఎం పదవి ఇచ్చేందుకు సిద్దంగా లేవు.

ఈ నేపథ్యంలో విశాఖలో కాపునాడు సభను కూడా నిర్వహించారు. ఈ సభకు వైసీపీ దూరంగా ఉంది. టీడీపీ, జనసేన నేతలు హాజరయ్యారు. అదే సమయంలో కేంద్రం కూడా కాపు రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చేయడంతో సీఎం జగన్ కచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఈసారి కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఓ సమస్య, ఇవ్వకపోతే మరో సమస్య జగన్ కు తప్పేలా లేదు.