గుంటూరు జిల్లా ‘ఇప్పటం’ కేసులో పిటిషనర్లకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి స్టే తెచ్చుకోవడాన్ని తీవ్రంగా గ్రహించింది. దీంతో పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 14 మందికి రూ.14 లక్షలు భారీ జరిమానా విధించడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటం గ్రామంలో ఆక్రమణల తొలగింపు రాజకీయ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
జనసేన పార్టీ వార్షిక సభకు భూములిచ్చారనే అక్కసుతో రాష్ట్ర ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తల ఇళ్ల కూల్చివేతకు దిగిందని పవన్‌కల్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్రామంలో ఇళ్ల తొలగింపును ఆయన స్వయంగా పరిశీలించారు.
ఇదే సందర్భంలో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ 14 మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే నోటీసులు ఇచ్చినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆధారాలతో సహా న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు.
ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్టు పిటిషనర్ల తరపు న్యాయవాది కూడా హైకోర్టులో అంగీకరించారు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా, సదరు న్యాయవాది పిటిషనర్ల తరపున క్షమాపణ చెప్పారు. తమకు అబద్ధాలు చెప్పి స్టే తెచ్చుకోవడంతో పాటు విలువైన సమయాన్ని వృథా చేశారనే కారణంతో పిటిషనర్లకు హైకోర్టు భారీ జరిమానా విధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అలాగే పిటిషనర్ల వ్యవహార శైలి ముమ్మాటికీ కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అని న్యాయస్థానం ఆగ్రహించింది.