ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వనిత వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మాటే ఆమెకు శత్రువైంది. తానొకటి అనుకుని మాట్లాడ్డం, అది మరొక అభిప్రాయానికి దారి తీస్తోంది. దీంతో అసలు మాట్లాడ్డాలంటేనే మంత్రి వనిత భయపడే స్థితి. తాజాగా రేపల్లె అత్యాచార ఘటనపై మంత్రి వనిత వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ప్రతిపక్షాలు విమర్శలకు పదును పెట్టాయి.
మంత్రిగా రెండోసారి కూడా అవకాశాన్ని దక్కించుకున్న వనితకు… కొత్తశాఖ నిద్ర కరువు చేస్తోంది. రేపల్లె అత్యాచారంపై వివాదానికి దారి తీసిన మంత్రి వ్యాఖ్యలేంటో చూద్దాం.
“అత్యాచారానికి పాల్పడిన వారు అసలు అమ్మాయిపై అత్యాచారం చేయడానికి రాలేదు. వాళ్లు తాగి వున్నారు. డబ్బు కోసం భర్తపై దాడి చేశారు. భర్తను రక్షించుకోడానికి భార్య వెళ్లినపుడు అత్యాచారానికి గురైంది. పేదరికం వల్లో, మానసిక పరిస్థితుల వల్లో అప్పటికప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతూ వుంటాయి” అని వనిత వ్యాఖ్యానించడపై ప్రతిపక్షాలు మండిపడుతున్నారు.
అప్పటికప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతూ వుంటాయని… మహిళలపై లైంగికదాడులను మహిళా హోం మినిస్టర్ బాధ్యతా రాహిత్యంతో మాట్లాడారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై లైంగికదాడులంటే అంత అలుసైందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారంపై వనిత వ్యాఖ్యలు ఇలాగే వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
అప్పుడు ఆమె … ‘ బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదే. తల్లి పాత్ర సక్రమంగా నిర్వర్తిస్తే అఘాయిత్యాలు తగ్గుతాయి. తల్లి పాత్ర సరిగా లేనప్పుడే ఇలాంటివి జరుగుతున్నాయి. పోలీసులను, ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు’ అని తానేటి వనిత వ్యాఖ్యానించడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి.
సమస్యల్ని అర్థం చేసుకోవడం, వాటి వెనుక సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాల కోణంలో విశ్లేషించే క్రమంలో మంత్రి వనిత తడబడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోపం ఎక్కడ జరుగుతున్నదో గుర్తించి వివాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటే మంచిది.