టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ కావడంతో కేసీఆర్ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకుంది. కేసీఆర్, వైఎస్ జగన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రధానంగా కేసీఆర్ కేంద్రంలో మోదీని టార్గెట్ చేస్తున్నారు. అటు వైపు నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో తెలంగాణలో ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయాలు యుద్ధాన్ని తలపించనున్నాయి.
మరోవైపు బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెరవనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు అడిగితే ఏమంటారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ప్రతినిధులు ఇవాళ ప్రశ్నించారు. ఇది ఊహాజనిత ప్రశ్న అని ఆయన కొట్టి పారేశారు.
అయితే ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశాన్ని స్వాగతిస్తామన్నారు. ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ తమ నాయకుడు జగన్ను కేసీఆర్ మద్దతు అడిగితే… అప్పుడు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కానీ ఎవరితోనూ పొత్తు వుండదని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఏపీ ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి తప్ప మరేవి ముఖ్యం కాదన్నారు.
అలాగే కర్నాటకలో వైసీపీ పోటీ చేస్తుందా? అనే ప్రశ్నకు ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. కర్నాటకలోనే కాదు, తమిళనాడులో కూడా తమకు రాజకీయంగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అవకాశం ఉన్న తెలంగాణనే వద్దనుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్టు ఆయన తేల్చి చెప్పారు. ఏపీ ప్రజలకు అంకితమైన పార్టీగా వైసీపీ గురించి ఆయన చెప్పారు.
కేసీఆర్ మద్దతు అడిగితే… జగన్ ఆలోచించి నిర్ణయం చెబుతారనే సజ్జల అభిప్రా యాన్ని రాజకీయంగా ప్రత్యర్థులు ఎలా వాడుకుంటారో చూడాలి. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర విభజనపై సజ్జల వ్యాఖ్యలను వక్రీకరించిన సంగతి తెలిసిందే. అదే మాదిరిగా బీఆర్ఎస్తో వైసీపీకి ముడిపెట్టే అవకాశాలున్నాయి. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు.