టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల కర్నూలు జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించారు. బాదుడే బాదుడు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. బాబు సభలకు జనం వెల్లువెత్తారు. ఇది టీడీపీలో భరోసాను పెంచడంతో పాటు జనసేనపై మమకారాన్ని పోగొడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో జనసేనతో పొత్తు వుంటే బాగుంటుందని చంద్రబాబుతో పాటు టీడీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.
అయితే తన సభలకే జనం భారీ సంఖ్యలో వస్తుండడంతో జనసేనతో పొత్తుపై టీడీపీలో పునరాలోచన మొదలైనట్టు సమాచారం. పవన్‌కల్యాణ్‌తో అవసరం లేకుండానే అధికారంలోకి వస్తామని ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేశ్ అండ్ టీం పవన్‌తో పొత్తుకు అఇష్టత చూపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీకి అధికారం తన భిక్షే అని పవన్‌కల్యాణ్ అనేకమార్లు చెప్పడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
పవన్ వ్యాఖ్యలు ఇప్పటికీ వారి మనసుల్ని తొలుస్తున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే కాదనలేమని, కానీ సాధ్యమైనంత వరకూ ఆ పార్టీకి దూరంగా వుండడమే మంచిదనే అభిప్రాయాలు టీడీపీ నేతల్లో లేకపోలేదు. 2019లో వైసీపీ ఒంటరిగానే అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు తామెందుకు రాలేమనే ప్రశ్న ఆ పార్టీలో చర్చకు దారి తీసింది. జగన్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత వుందని, గెలుస్తుందన్న పార్టీకే ప్రజలు పట్టం కడతారని టీడీపీ గట్టి నమ్మకంతో వుంది. తామే ప్రధాన ప్రతిపక్షమైన పరిస్థితిలో ప్రజలు మరో పార్టీ వైపు చూసే అవకాశమే లేదనేది టీడీపీ నేతల వాదన.
ఒకవేళ పవన్‌కల్యాణ్ తనకు తానుగా పొత్తు కోసం వస్తే ఆలోచించొచ్చని అంటున్నారు. రాయలసీమలో టీడీపీకి బలం తక్కువని, అలాంటి చోట జనం వెల్లువెత్తడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు సంకేతంగా టీడీపీ అంచనా వేస్తోంది. కర్నూలు జిల్లాలో బాబు సభలకు జనం భారీగా రావడం వైసీపీని కూడా కలవరపెడుతోంది.
తమ అడ్డాగా భావించే రాయలసీమలో బాబు సభలకు జనం పెద్ద ఎత్తున వెళ్లడం ఏంటనే అంతర్మథనం అధికార పార్టీలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బాబు సభలకు వచ్చే జనాన్ని బట్టి పవన్‌తో పొత్తు ఆధారపడి వుంటుందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. జనసేనతో పొత్తు వుంటే ఒక మేలు, లేకపోతే రెండు మేళ్లు అన్నట్టుగా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.