ఢిల్లీ నుంచి భారతదేశాన్ని ఏలుతున్న మోడీ సర్కారు పట్ల అంతా సానుకూలంగానే ఉందా? 2014 నుంచి 2019 మధ్యన ఐదేళ్ల పాటు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని, రెండోసారి అంతకు మించిన మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న నరేంద్రమోడీ… ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మరోసారి కంఫర్ట్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరని అంటున్నాయి వివిధ సర్వేలు. ఈ మధ్యకాలంలో ప్రచురితం అవుతున్న పలు సర్వేలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి.
ఎన్డీయే రూపం అవసరం లేదని, కేవలం బీజేపీనే సొంతంగా కంఫర్ట్ మెజారిటీని పొంది కేంద్రంలో మూడోసారి కూడా వరసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి వివిధ అధ్యయనాలు!
మరి మోడీ పాలన అంత ప్రజారంజకంగా సాగుతోందా? అంటే… ఎవ్వరూ ఔనని చెప్పరు! మోడీ ప్రభుత్వ హయాం వచ్చాకా అనేక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి. ధరలపై నియంత్రణ లేదు. రూపాయి పతనం ఆగడ లేదు. పెట్రో ధరలు ఆల్ టైమ్ రికార్డులను సెట్ చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తుల అమ్మకం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. ఆస్తులూ అమ్మి, పన్నులూ పెంచి, పారిశ్రామిక వేత్తలకు పెట్టడమే తప్ప.. ప్రజలకు ప్రయోజనాలు లేవు. చెప్పుకోదగిన పథకాన్ని తీసుకురాలేదు. ఏ ఉపాధి హామీ పథకం స్థాయి ప్రోగ్రామ్ డిజైన్ జరగలేదు. ఇవి గాక.. నోట్ల రద్దు, జీఎస్టీల వల్ల సామాన్యులు చితికిపోవడమే తప్ప మరో ఉపయోగం లేదు!
మరి సామాన్యులు డైరెక్టుగా బాధితులు అయ్యే రకరకాల కార్యక్రమాలను మోడీ నిర్భీతిగా అమల్లో పెడుతూనే ఉన్నారు. వాటిని భక్తులు సమర్థించుకుంటూనే ఉన్నారు! మరి ఇలాంటప్పుడు భారతీయ జనతా పార్టీకి మరోసారి తిరుగులేని మెజారిటీతో అధికారం ఎలా దక్కుతుంది? అంటే.. మతం అనే సమాధానం గట్టిగా వినిపిస్తుంది. బీజేపీ హిందుత్వ రాజకీయాలకు చాలా రాష్ట్రాల్లో ప్రజలు పూర్తి స్థాయిలో సమ్మోహనులు అయ్యారని, ఫలితంగా కేంద్రంలో మరోసారి కమలం పార్టీకి కంఫర్ట్ మెజారిటీ దక్కవచ్చనేది స్థూలంగా వినిపిస్తున్న వాదన. ఇది తేలికగా కొట్టి పడేసే అంశం ఏమీ కాదు.
మోడీ ఏం చేయనక్కర్లేదు. ఆయనకు ఏది తోస్తే దాన్ని చేయవచ్చని… ఇంకోసారే కాదు, ఆ తర్వాత కూడా బీజేపీకే అవకాశం దక్కవచ్చని.. బీజేపీ నేతలు తమ ప్రోపగండాతో అలాంటి పరిస్థితిని ఆల్రెడీ తీసుకువచ్చారనే విశ్లేషణలకూ కొదవలేదు. ప్రజలు, ప్రజాప్రయోజనాలు ..ఇవన్నీ ఇప్పుడు బీజేపీ పట్టించుకోవాల్సిన అంశాలు కావని, వాళ్లు ఆల్రెడీ కొన్ని విత్తనాలు వేసేశారు కాబట్టి.. ఫలితాలను రాబట్టుకోవడం వారికి అత్యంత సులువు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజలకు ఏం చెబితే ఓట్లేస్తారో, ప్రజలకు ఎలా చెప్పాలో మోడీకి బాగా తెలుసని.. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి రికార్డు స్థాయి ఎంపీ సీట్లు మరోసారి కూడా దక్కడం ఖాయమని అంటున్నారు. అధ్యయనాలు, సర్వేలు కూడా.. బీజేపీకే మళ్లీ మినిమం మెజారిటీ అంటున్నాయి!
ప్రజలకు తమకు వరసగా అవకాశం ఇస్తుంటే.. తాము చేస్తున్న ప్రతి పనినీ సమర్థిస్తున్నట్టే అని రాజకీయ నేతలు అనుకోవడం ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పై ఇంకా తగ్గని వ్యతిరేకత వల్లనో, కాంగ్రెస్ కు గట్టిగా చెప్పుకోదగ్గ ప్రధానమంత్రి అభ్యర్థి లేకపోవడంతో.. కూడా బీజేపీకి వరసగా మినిమం మెజారిటీ దక్కుతుండవచ్చు! బీజేపీ వ్యతిరేక పార్టీల హోదాలో కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాల కన్నా ప్రాంతీయ పార్టీలే ఎక్కువగా ఉన్నాయి.
బీజేపీ అనుకూల ఓట్ల , ఇలా ఎన్డీయేతర పార్టీల మధ్య ఓట్ల చీలిక కూడా కొన్ని చోట్ల బీజేపీని చాంఫియన్ గా నిలుపుతూ ఉండవచ్చు! ఇలాంటి సమీకరణాలు ఎన్ని ఉన్నా.. బీజేపీ ఒకే వాదనతో గెలుస్తోంది, బీజేపీ ఆ వాదనకు అనుగుణంగా పాలన సాగించి, మిగతా వ్యవహారాలన్నింటినీ నిర్లక్ష్యం చేసినా, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్నా.. అదంతా లెక్కలోకి రాదనే అభిప్రాయాలు కూడా క్రమంగా బలపడుతున్నాయి. మరి ఇవే అభిప్రాయాలు ఏలుతున్న వారికి ఏర్పడితే అది ఇంకా ప్రమాదకరం!
ఏం చేసినా, ఏం చేయకపోయినా.. తమకు తిరుగులేదనుకునే తత్వం కమలం పార్టీ నేతలకు అలవడితే.. వారికి రాజకీయంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎందుకంటే.. బీజేపీ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుందని, మోడీ దేశాన్ని తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలుపుతాడని ఆ పార్టీకి గట్టిగా ఓట్లు వేస్తున్న వారు కూడా ఆశించడం లేదు కాబోలు! మోడీ ఆ సీట్లో కూర్చుంటే చాలు ఇక వేరేదేం అయిపోయినా ఫర్వాలేదు అనే తీరు వారిలో కనిపిస్తూ ఉంటుంది. ఇది మరింత ప్రమాదకరం కూడా!