క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? సంక్షేమ పథకాల అమలు గురించి జనం ఏమనుకుంటున్నారు? తన పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం అవుతున్నారు. ప్రతి వారం ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది కార్యకర్తల్ని తాడేపల్లికి రప్పిస్తున్నారు. జగన్ ఆలోచన బాగుంది. మూడున్నరేళ్ల పాలనపై తనకు తానుగా గొప్పలు చెప్పుకోవడం కాకుండా, కార్యకర్తలు ఏమంటారో తెలుసుకునేందుకు జగన్ నిర్ణయించడాన్ని కొందరు ప్రశంసించారు.
అయితే కార్యకర్తల మీటింగ్‌లో లక్ష్యానికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారనే విమర్శ లేకపోలేదు. కార్యకర్తల అభిప్రాయాలను వినే ఓపిక జగన్‌కు లేదని అంటున్నారు. ఎంత సేపూ 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలని, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు చెప్పి పంపిస్తున్నారనే విమర్శ వస్తోంది. అలాగే గడపగడపకూ వెళ్లి నవరత్నాల పథకాలపై ప్రచారం చేయాలని జగన్ కోరుతున్నారు. ఈ మాత్రం దానికైతే తాడేపల్లికి పిలిపించుకోవడం ఎందుకని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
బహిరంగ సమావేశాల్లో దిశానిర్దేశం చేసినట్టుగానే, కార్యకర్తల సమావేశంలోనూ జగన్ అవే మాటలు చెప్పడం ఏంటని నిలదీస్తున్నారు. మూడున్నరేళ్ల పాలన పూర్తియిందని, ఇప్పటికీ తమ గోడు వినకపోతే ఎలా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఇలాగైతే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో జగన్‌కు ఎలా తెలుస్తుందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలతో మాట్లాడిస్తే… తమను పట్టించుకునే దిక్కు లేదని, వాలంటీర్లే అన్నీ చూసుకుంటున్నారని, గ్రామస్థాయి నాయకులతో పాటు అధికార పార్టీ ప్రతినిధులుగా తమకు గుర్తింపు, గౌరవం లేదని చెబుతారనే భయం జగన్‌లో ఉన్నట్టు కనిపిస్తోందని వారు అంటున్నారు.
కుప్పం కార్యకర్తలతో మొట్టమొదటగా సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అన్ని సమావేశాల్లోనూ జగన్ మాట్లాడ్డం తప్పితే, తమను మాట్లాడించడం లేదనేది కార్యకర్తల ఫిర్యాదు. ఇప్పటికైనా కార్యకర్తలు ఏం చెబుతారో జగన్ వింటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.