ఏపీలో మరోసారి అధికార పగ్గాలు అందుకోవాలని వైసీపీ చూస్తోంది. ఈసారి టీడీపీతో ఫైనల్ ఫైట్ అని కూడా భావిస్తోంది. ఈ సారి కనుక గెలిచేస్తే ఇక మూడు దశాబ్దాల సీఎం కల కూడా వైసీపీ అధినాయకత్వానికి తీరిపోతుంది అని విశ్లేషించుకుంటోంది. అలాగే ఏపీలో విపక్షాలు కూడా పోటీకి పెద్దగా లేని పరిస్థితి 2029 నాటికి ఉండేలా 2024 ఎన్నికలల్లోనే సరైన జవాబు చెప్పాలనుకుంటోంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ నినాదం ఏంటి అన్నది చూస్తే అందరూ ఊహిస్తున్నట్లుగానే సంక్షేమ పధకాలనే ఆసరాగా చేసుకుని జనంలోకి వెళ్ళబోతున్నారు అని తెలుస్తోంది. ఆ విషయం మీద వైసీపీ కీలక నేత, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ఫోటోయే పార్టీని మళ్లీ గెలిపిస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము ప్రజలలోకి వెళ్ళి చేసిన కార్యక్రమాలు చెబుతామని, సంక్షేమ పధకాలు కావాలన్నా కొనసాగాలన్నా వైసీపీకే ఓటు వేయాలని కోరుతామని ఆయన చెప్పారు.
దేశంలో ఎక్కడా లేన్ని పధకాలను ఏపీలో అమలు చేస్తున్నామని, ఎవరొచ్చినా తమ కంటే గొప్పగా పధకాలు అమలు చేసేది లేనే లేదని వైవీ సుబ్బారెడ్డి పేర్కొంటున్నారు. వైసీపీకి సంక్షేమ పధకాలే శ్రీరామ రక్ష అని ఆయన అభివర్ణించారు.
వైసీపీ పధకాల మీదనే ఆశలు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తోంది అన్నది సుబ్బారెడ్డి మాటల బట్టి అర్ధమవుతోంది. తమకంటే ఎవరూ పధకాలు ప్రవేశపెట్టలేరు అని కూడా చెబుతున్నారు. పధకాలు కొనసాగాలంటే వైసీపీ రావాలని కొత్త నినాదాన్ని వైసీపీ తయారు చేసుకున్నట్లుగా కూడా అర్ధమవుతోంది.
రావాలి జగన్ కావాలి జగన్ నినాదాన్ని తలదన్నేలా ఈ కొత్త నినాదం వైసీపీకి పదునైన రాజకీయ అస్త్రమే అని చెబుతున్నారు. అంటే రేపటి రోజున వైసీపీ కాకుండా టీడీపీ వస్తే కనుక ఈ పధకాలను అమలు చేయదు అని చెబుతూ వైసీపీ వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటుంది అన్న మాట. పధకాల విషయంలో జనాలు కనుక పూర్తి సుముఖంగా ఉంటే వైసీపీకి అదే వజ్రాయుధం. తాము తప్ప పధకాలు ఎవరూ కొనసాగించలేరు అని చెప్పడం ద్వారా టీడీపీని పొలిటికల్ గా కార్నర్ చేసేందుకు వైసీపీ చూస్తోంది అంటున్నారు.