అమరావతిపై చేతులు కాలాక ఆకులు పట్టుకునేందుకు వచ్చిన న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌పై రాజధాని ప్రాంత దళిత నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కేవలం రాజకీయ స్వార్థం, అవకాశం వాదంతో అమరావతి కోసం తానేదో వీరోచిత పోరాటం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారని దళిత నేతలు మండిపడుతున్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసేందుకు అమరావతి పరిరక్షణ పేరుతో జడలు విప్పి, నృత్యం చేస్తున్నాడని దళిత నేతలు గుర్రుగా ఉన్నారు.
మూడు నెలల క్రితం చంద్రబాబునాయుడిని జడ శ్రావణ్‌కుమార్ కలవడాన్ని ఈ సందర్భంగా దళిత నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నుంచి పొందిన హామీ ఏంటి? ఆ తర్వాతే రాజధాని పేరుతో నాటకానికి తెర తీశారా? లేదా? అని వారు నిలదీస్తున్నారు. తాజాగా తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద జడను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. అమరావతికి జడ వల్ల ప్రయోజనం ఏమీ లేదని, దాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికే ఇటీవల కాలంలో ఆయన యాక్టీవ్ అయ్యారని ఉద్యమ దళిత నేతలు గుర్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా జడ శ్రావణ్‌కుమార్ నిబద్ధత, చిత్తశుద్ధికి సంబంధించి కొన్ని ప్రశ్నల్ని అమరావతి ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొంటున్న నేతలు ప్రశ్నిస్తున్నారు.
1. తాడికొండలో పోటీ చేయడం కోసమే ఇప్పుడీ దీక్ష డ్రామా? అనేది నిజమా? కాదా?
2. గత మూడేళ్లలో అమరావతి శిబిరాల వైపు ఎప్పుడైనా శ్రావణ్ వచ్చారా?
3. ఆర్-5 జోన్ కేసులో సుప్రీంకోర్టులో తాను కూడా ఇంప్లీడ్ అవుతున్నట్టు మీడియాలో హడావుడి చేసి, విమానంలో ఢిల్లీ వెళ్లి, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి…చివరికి ఏం చేశావ్? ఆ కేసులో ఇంప్లీడ్ కాకుండానే తిరిగి రావడం నిజమా? కాదా?
4. ఒకవేళ ఇంప్లీడ్ అయి వుంటే సాక్ష్యం వుందా?
5. ఇటీవల కాలంలో రాజధాని ప్రాంతంలో పాదయాత్ర, తాజాగా 48 గంటల దీక్ష ప్రకటనల్నీ చంద్రబాబు దృష్టిలో పడడం కోసం కాదా?
6. అమరావతి ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు నిమ్మకుండిపోయి, ఇప్పుడు ఎన్నికల సీజన్‌లో మాత్రమే కనిపించడం వెనుక దురుద్దేశాన్ని బయట పెట్టగల దమ్ము, ధైర్యం ఉన్నాయా?
7. రాజధానిని సొంత రాజకీయ ఎజెండా కోసం ఉద్యమకారుల త్యాగాలను బలి పెట్టేందుకు ఆడుతున్న డ్రామా కాదా? నిజంగా రాజధానిపై చిత్తశుద్ధి వుంటే తాడికొండ నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదని ప్రకటించగలరా? అని అమరావతి దళిత ఉద్యమకారులు జడ శ్రావణ్‌కు ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటిపై ఆయన సమాధానం ఏంటో చూడాలి.
జడ శ్రావణ్‌కుమార్ పూర్తిగా రాజకీయ స్వార్థంతో ఉద్యమంలోకి చొరబడ్డారని, అతని విషయంలో అప్రమత్తంగా ఉండాలని దళిత నేతలు హెచ్చరించడం గమనార్హం. జడ మాయలో పడితే, రానున్న రోజుల్లో రాజధాని తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని, ఉద్యమకారులు ఏ దిక్కూ లేకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.