ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇల్లు సంక్రాంతి శోభతో కలకలలాడుతోంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పర్యవేక్షణలో తాడేపల్లిలోని జగన్ నివాసాన్ని పల్లెదనం ఉట్టిపడేలా చక్కగా అలంకరించారు. ప్రతి ఏడాది సీఎం జగన్ సంక్రాంతిని సంప్రదాయ బద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. క్రిస్టియన్ విశ్వాసాలు కలిగిన జగన్ దంపతులు హిందూ సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు.
సీఎం జగన్ ఇంట భోగి మంటలు, గంగిరెద్దులాట, అలాగే నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు అద్భుతంగా సాగాయి. మిమిక్రీ, పాటలు, సంప్రదాయ నృత్యాలు అలరించాయి.
నీలకంఠ అనే మిమిక్రీ కళాకారుడు దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్టీఆర్, రోశయ్యలతో పాటు సినీ దిగ్గజాలు ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణ తదితరుల మాటలను అనుకరించి అభినందనలు అందుకున్నారు. అలాగే సీఎం జగన్ మాటల్ని కూడా ఆయన వదిలిపెట్టలేదు.
జగన్‌ను అందగాడిగా శోభన్‌బాబు చెప్పినట్టు మిమిక్రీ కళాకారుడు అభివర్ణించినప్పుడు వైఎస్ భారతి నవ్వుతూ కనిపించారు. అలాగే లక్ష్మిపార్వతి మాటల్ని అనుకరించినప్పుడు కూడా నవ్వులు పూయించాయి. మొత్తానికి సంక్రాంతి సంబరాలు సీఎం జగన్ ఇంట పసందుగా సాగడం విశేషం.