ఏదైనా ఒక అంశంపై వివాదాలు రేపడంలో రాజకీయ నాయకులు ఎప్పుడూ ముందుంటారు. ఉద్దేశపూర్వకంగానే వివాదాలు రేపుతుంటారు. ఒక్కోసారి వారు తెలియక చేసిన కామెంట్లు వివాదాలుగా మారుతుంటాయి. అలాటప్పుడు కొందరు పొరపాటు జరిగిపోయిందని అంటారు. క్షమాపణలు కూడా కోరతారు. కొందరు తాను అలా అనలేదని, మీడియా వక్రీకరించిందని మొండిగా వాదిస్తారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి పెద్దా చిన్న అనే తేడా ఏమీ ఉండదు. ప్రతిపక్ష నాయకులూ చేస్తారు. అధికార పార్టీవారూ చేస్తారు. బాధ్యత గల పదవుల్లో లేనివారు ఏం మాట్లాడినా మీడియా పట్టించుకోదు. జనమూ లైట్ తీసుకుంటారు. కానీ పెద్ద పదవుల్లో, నాయకత్వ పదవుల్లో ఉన్నవారు నోరుజారితే అది తప్పనిసరిగా చర్చనీయాంశం అవుతుంది. దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ఇప్పుడు ఏపీ సీఎం జగన్ అలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. మూడు రాజధానుల కేసు సుప్రీం కోర్టు విచారణలో ఉండగానే విశాఖే రాజధాని అవుతుందని, తాను కూడా త్వరలో అక్కడికే తరలి వెళతానని ఆయన ఢిల్లీలో ఒక కీలక సమావేశంలో కామెంట్ చేయడం ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. చర్చకు తావిచ్చింది. ఒక కేసు సుప్రీం కోర్టు కావొచ్చు, హైకోర్టు కావొచ్చు, మరో కోర్టులో కావొచ్చు విచారణలో ఉన్నప్పుడు దానికి సంబంధించి బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయకూడదు. ఇది అందరికీ తెలిసిన సూత్రమే. జగన్ కు ఈ సంగతి తెలియకుండా ఉంటుందా? మరి అలాంటప్పుడు ఎందుకు కామెంట్ చేసినట్లు?
ఇదివరకు ఇదే కేసు హై కోర్టులో ఉన్నప్పుడు కూడా మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీఎం సీట్లో ఉన్న జగన్ మాట్లాడారు కాబట్టి దుమారం రేగుతోంది. మంగళవారం జరిగిన గ్లోబర్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో త్వరలోనే విశాఖ ఏపీ రాజధాని కాబోతుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉండగా.. సీఎం హోదాలో ఉండి జగన్ రాజధాని గురించి మాట్లాడటం సరికాదంటూ ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు.
ఈ క్రమంలో సీఎం జగన్ సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు ఊహించని షాక్ ఇచ్చారు. ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రకటన చేసి సీఎం జగన్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని భారత చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణ వేళ జగన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని.. నిబంధనల ప్రకారం జగన్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని.. జగన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు. కాగా, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఎంపీ ఏకంగా చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోర్టులో తీర్పు రాకుండా ఎలా రాజధాని మార్చగలరని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇవన్నీ సీఎం జగన్ కు తెలియనివేమీ కావు. ఏపీ రాజధాని అంశం ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో ఉంది. రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. ప్రస్తుతం రాజధాని అమరావతి మాత్రమే. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉది. ఇది అత్యంత క్లిష్టమైన కేసుగా న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం అనుకోగానే రాజధాని మార్పు చేయలేరు. ఎందుకంటే రాజధాని పేరుతో 29వేల మంది నుంచి ప్రభుత్వమే భూములు సమీకరణ చేసింది. వారికి అనేక వాగ్దానాలు చేసింది. అవి నేరవేర్చకపోతే నష్టపరిహారం ఇస్తామని ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం రాజధానిని మార్చాంటే.. ఈ సమస్యలను అధిగమించాలి.
సుప్రీంకోర్టులో దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చిన తర్వాతనే రాజధానిని మార్చగలరా లేదా అన్నది తేలుతుంది. కానీ సీఎం జగన్ మాత్రం సుప్రీంకోర్టు విచారణను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నట్లుగా ప్రకటించడం సంచలనంగా మారింది. విశాఖ రాజధాని అంశంపై విస్తృతంగా చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఏపీలో రాజధాని అంశం పూర్తిగా చల్లబడిపోయింది. రాజధాని రైతులు పాదయాత్రను విరమించారు. వైఎస్ఆర్సీపీ కూడా మూడు రాజధానుల ఉద్యమం చేయడం లేదు. ఈ క్రమంలో మరోసారి రాజధాని అంశం చర్చకు రావడం రాజకీయంగా అవసరం అన్న ఉద్దేశంతోనే ఈ కామెంట్లను వ్యూహాత్మకంగా ఢిల్లీలో చేశారని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఫోకస్ అవడానికే ఈ ప్రకటన చేశారని.. అదే రాష్ట్రంలో చేసి ఉంటే.. రాష్ట్రంలో మాత్రమే చర్చనీయాంశం అయ్యేదని అంటున్నారు.
పెట్టుబడిదారుల్లో ఉన్న మూడు రాజధానుల డైలమాను.. జగన్ తీర్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలించాలన్నది సీఎం ఇష్టమని పలుమార్లు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. ఆ సిద్ధాంతం ప్రకారం సీఎం క్యాంప్ ఆఫీసును విశాఖలో ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్నికోర్టులు కూడా అడ్డుకోలేవు. కానీ శాఖల్ని మాత్రం మార్చలేదు. అమరావతినే రాజకీయంగా రాజధానిగా ఉంటుందని అంటున్నారు. విశాఖ నుంచి జగన్ పరిపాలన చేసుకోవచ్చు కానీ అది రాజధాని కాదని అంటున్నారు. అన్ని న్యాయపరమైన చిక్కులు పరిష్కరించుకున్న తర్వాత మరో బిల్లు పెట్టి ఆమోదించుకున్న తర్వాతనే మూడు రాజధానులు లేదా విశాఖ రాజధాని సాధ్యమవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.