ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గద్దెనెక్కుతారు అని వైసీపీ ధీమాగా చెబుతోంది. రాజకీయంగా తలపండిన నేత, దశాబ్దాల అనుభవం ఉన్న ఉత్తరాంధ్ర నాయకుడు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మళ్లీ అధికారంలోకి వచ్చేది జగనే అంటూ కుండబద్దలు కొట్టారు.
జగన్ సీఎం గా ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటూ ఓటేశారు అని చెప్పారు. జగన్ ఈసారి విశాఖ నుంచే సీఎం గా ప్రమాణం చేస్తారని ఆయన అన్నారు. దానికి సంబంధించిన టైమ్, డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నామని మీడియాకు చెప్పారు.
ఏపీలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తున్నాయి. ఆ తరువాత మంచి రోజు చూసుకుని జగన్ సీఎం గా విశాఖ నుంచే ప్రమాణంతో పాటు పాలన కూడా చేపడతారని అంటున్నారు. జగన్ సీఎం గా విశాఖ నుంచి జూన్ 8 లేదా 11 తేదీలలో ప్రమాణం చేస్తారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రెండు తేదీలతో పాటు మరో తేదీని కూడా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు.
విశాఖలో అట్టహాసంగా అంగరంగ వైభవంగా సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం సాగుతుందని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తూంటే వైసీపీలో గెలుపు పట్ల ఎంతటి ధీమా వ్యక్తం అవుతుందో అని అంటున్నారు. జగన్ కూడా తన గెలుపు ఖాయమని ఎన్నికల ఫలితాలు లాంచనం అన్నట్లుగానే ఒక ట్వీట్ ద్వారా ప్రజలకు అభినందనలు తెలిపారు. మరోసారి మన పాలన ప్రారంభం అవుతుందని మరింత మెరుగైన పాలనతో ప్రజల ముందుకు వస్తామని జగన్ ట్వీట్ చేశారు.
ఇవన్నీ చూస్తూంటే గెలుపు మీద వైసీపీ ఆశలు చాలా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఈ ధీమాకు కారణాలు తమకు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ అయితే లాజిక్ కి అందని మాటలతో గెలుపు తమదే అని చెబుతోందని వారు విమర్శిస్తున్నారు. జూన్ 4న ఫలితాలు ఏ విధంగా వస్తాయో కానీ అటు టీడీపీ కూటమి ఇటు వైసీపీ మాత్రం మేమే అధికారంలోకి వచ్చేది అని పోటీ పడి మరీ చెబుతున్నాయి.