వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అనే సంగతి అందరికీ తెలుసు. కానీ.. ఆయన ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు, పరిపాలనలో ముందుకు సాగుతున్న క్రమం గమనిస్తే.. జగన్ అంటేనే ఏసీ సీఎం అని పేరు తెచ్చుకుంటారనే అభిప్రాయం ఏర్పడుతోంది.
ఇంతకూ ఏసీ అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలియదూ.. గదిని చల్లగా ఉంచే యంత్రమే కదా అనుకుంటున్నారా? కాదు కాదు.. ఏసీ అంటే ‘యాంటీ కరప్షన్’!
జగన్ పాలన సాగిస్తున్న తీరును గమనిస్తే.. అవినీతిని నిరోధించడంలో, ఎదుర్కోవడంలో ఆయన చూపిస్తున్న శ్రద్ధ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కనబరచలేదని అర్థమవుతుంది. ప్రతి సందర్భంలోనూ అవినీతి నిరోధం గురించి ఆయన చెబుతూనే ఉన్నారు. దానికి సంబంధించిన వ్యవస్థను కూడా ఎంతో పటిష్టం చేశారు.
ప్రభుత్వంలోని అనేక కీలక శాఖలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్సయిజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, అడవులు, గనులు తదితర శాఖలతో సమీక్షించారు.
ఇవి ప్రజలతో నిత్యం సంబధం కలిగిఉండే, లావాదేవీలు జరుగుతూ ఉండే శాఖలు. అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉండే శాఖలు కూడా. అందుకే కాబోలు.. ఈ శాఖల సమీక్షలో అవినీతిని నిరోధించడమే ప్రధాన లక్ష్యం అన్నట్టుగా వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అవినీతి నిరోధక శాఖను పటిష్టం చేయడం, వారి ద్వారా.. ఇతర ప్రభుత్వ విభాగాల్లో పేరుకుపోయిన అవినీతిని కట్టడి చేయడంపై బాగా దృష్టి పెట్టారు. అవినీతి నిరోధక శాఖ కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబరు కూడా ప్రారంభించారు. అలాగే అవినీతి నిరోధక శాఖకు కంప్లయింట్ చేయడానికి ఒక యాప్ కూడా ప్రారంభించారు.
ఏ శాఖలో ఎలాంటి అవినీతి చోటు చేసుకున్నా సహించేది లేదనే సంకేతాలను ప్రభుత్వ వర్గాలలోకి జగన్ సమర్థంగా పంపగలిగారు.
తాజాగా వివిధ శాఖలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా.. జగన్ ప్రత్యేకంగా అవినీతి నిరోధం మీదనే ఫోకస్ పెట్టడం విశేషం. ఏసీబీ కోసం ఉద్దేశించిన టోల్ ఫ్రీ నెంబరు 14400 ను.. బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడంపై కూడా ఆయన సలహాలు ఇచ్చారు. అన్ని ప్రభుత్వా కార్యాలయాలు, ఆసుపత్రుల్లో ఈ నెంబరు, ఏసీబీకి ఫిర్యాదు చేయగల అవకాశాల గురించి ప్రజలందరికీ తెలిసేలా పోస్టర్లు ఏర్పాటు చేయాలని జగన్ సూచించడం విశేషం.
అవినీతి లేకుండా చేస్తాం అనే మాటలు దాదాపుగా ప్రతి రాజకీయ నాయకుడినుంచి వింటూ ఉంటాం. అయితే అందుకు క్రియాశీలమైన చర్యలు తీసుకోవడం మాత్రం కొంతమందిలోనే కనిపిస్తూ ఉంటుంది.
జగన్ ఇలా టోల్ ఫ్రీ నెంబరు, యాప్ లు తీసుకువచ్చినంత మాత్రాన రాష్ట్రంలో అసలు అవినీతి అంతమైపోయిందని అనలేం. కాకపోతే.. అంతం చేయడానికి ఒక గట్టి ప్రయత్నం మాత్రం ఇప్పుడే మొదలైందని ఒప్పుకోవాలి. పూర్తిగా అంతం కావాలంటే.. ప్రజల స్పందన కూడా ముఖ్యమని తెలుసుకోవాలి.
ఏదేమైనా సరే.. అవినీతి నిరోధానికి తీసుకుంటున్న ఇలాంటి చర్యల ద్వారా.. తాను యాంటీ కరప్షన్ (ఏసీ) ముఖ్యమంత్రిగా జగన్ పేరు తెచ్చుకుంటారు!