‘వై నాట్ 175’ అనే నినాదంతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలంటూ వస్తే ‘క్లీన్ స్వీప్’ చేయాలని, తనకు తాను కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఆడడానికి.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు నెలల వ్యవధిలో ఖాళీ కాబోతున్న 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ 14 స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపోస్తోంది.
ఖాళీ అవుతున్న 14 నియోజకవర్గా లలో ఎమ్మెల్సీ స్థానాలలో వైయస్ఆర్ కాంగ్రెసుకు ఉన్న బలం ఒకే ఒక్కటి. ఆ పార్టీకి చెందిన వెన్నపూస గోపాల్ రెడ్డి ప్రస్తుతం మండలిలో ఉన్నారు. తతిమ్మా అన్ని స్థానాలు విపక్షాలవి మాత్రమే. ఖాళీ అవుతున్న వాటిలో తెలుగుదేశానికి ఎనిమిది మంది, బిజెపికి 2, పిడిఎఫ్ 2 స్వతంత్ర సభ్యులు ఒకరు ఉన్నారు. అయితే ఇప్పుడు జరగబోయే ఎన్నికలలోక్లీన్ స్వీప్ చేయడం ద్వారా మొత్తం 14 స్థానాలను గెలుచుకోవాలని అనుకుంటున్న వైసిపి తమ కలను నెరవేర్చుకోగలిగితే గనుక, శాసనమండలిలో ఆ పార్టీ బలం అనల్పంగా పెరుగుతుంది. అలా జరగగల అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల కోటాలో జరిగే తొమ్మిది స్థానాలు పూర్తిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల వ్యవహారం ఉంటుంది. ఈ స్థానాలను కూడా సొంతం చేసుకోవడం గురించి పార్టీ చాలా కాలం నుంచి ఫోకస్ పెట్టింది. గత తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో పీడీఎఫ్ కు దక్కిన స్థానాలు కూడా ఈసారి వైసీపీకే దక్కే చాన్సుంది. బిజెపి స్థానాలు కూడా వైసీపీ పరం అవుతాయనడంలో సందేహం లేదు.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి రోజుల్లో శాసనమండలిలో వారికి తగినంత బలం లేకపోవడం వలన మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో వెనక్కు తగ్గవలసి వచ్చింది. రాజధాని వ్యవహారం కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరకు ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నారు కూడా! ఒక దశలో మండలిని రద్దు చేయాలనుకున్న జగన్ తర్వాత అదే మండలంలో తన పార్టీ బలాన్ని పెంచుకోగలిగారు.
ఇప్పుడు తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తి అయితే అటు శాసనసభ, ఇటు శాసనమండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీని కలిగి ఉంటుంది. రెండు సభలలో అనూహ్యమైన, అపరిమిత బలం ఏర్పడిన తర్వాత జగన్ మరోసారి మూడు రాజధానులు ప్రయత్నం చేస్తారనే చర్చ సర్వత్రా విన వస్తోంది.