పోటీ చేయన‌ని జ‌గ‌న్‌కు చెప్పా.. ఇక ఆయ‌నిష్టం!

ఒంగోలు ఎంపీ స్థానం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి బ‌ల‌మైన అభ్య‌ర్థి కావ‌లెను. సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డితో సీఎం జ‌గ‌న్‌కు ఏదో తేడా వ‌చ్చింది. దీంతో మాగుంట పోటీపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.…

ఒంగోలు ఎంపీ స్థానం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి బ‌ల‌మైన అభ్య‌ర్థి కావ‌లెను. సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డితో సీఎం జ‌గ‌న్‌కు ఏదో తేడా వ‌చ్చింది. దీంతో మాగుంట పోటీపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. మ‌రోవైపు కొత్త‌గా తిరుప‌తి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పేరు తెర‌పైకి వ‌చ్చింది. మ‌రోవైపు మాజీ ఎంపీ, ఉత్త‌రాంధ్ర వైసీపీ కోఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పేరు తెర‌పైకి వ‌చ్చింది.

ఒంగోలు లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయ‌డంపై ఆయ‌న్ను మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా, ఆసక్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయ‌న‌ని ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు చెప్పిన‌ట్టు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. పోటీ చేసే ఉద్దేశ‌మే వుంటే, 2019లోనే బ‌రిలో నిలిచి కొన‌సాగే వాడిన‌న్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గ్యాప్ రావ‌డంతో పార్టీ ప‌నులు చూసుకుంటున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

అయితే ఒంగోలు నుంచి పోటీ చేయాలా? వ‌ద్దా? అనే విష‌య‌మై సీఎం జ‌గ‌న్‌దే తుది నిర్ణ‌యం అని వైవీ స్ప‌ష్టం చేశారు. టికెట్లు ద‌క్క‌ని నేత‌లు వైసీపీ వీడ‌డంపై ఆయ‌న స్పందించారు. స‌హ‌జంగా టికెట్లు ద‌క్క‌ని నేత‌ల్లో అసంతృప్తి వుంటుంద‌న్నారు. అలాంటి వారిని బుజ్జ‌గిస్తామ‌న్నారు. అలాగే కొంద‌రు సీనియ‌ర్లు పార్టీ వీడ‌డానికి వారి వ్య‌క్తిగ‌త కార‌ణాలున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. సీట్లు ద‌క్క‌ని నేత‌లు కొత్త అభ్య‌ర్థుల‌తో అడ్జ‌స్ట్ కావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.  

పండుగ త‌ర్వాత వైసీపీ తుది జాబితా వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు. వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినందువ‌ల్ల త‌మ‌కొచ్చిన ఇబ్బందేమీ లేద‌న్నారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మార్పులు చేయ‌లేద‌న్నారు.