ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చిదిద్దిన నాయకుడే .. నేడు ఆయనకు ప్రత్యర్థిగా తయారయ్యారు. పులివెందులలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యర్థిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రనాయుడు స్పష్టత ఇచ్చారు. సినిమాటిక్‌గా బీటెక్ రవి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ప్రకటించడం విశేషం.
“కుప్పం వెళ్లి జగన్ మాట్లాడాడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. వైనాట్ పులివెందుల.. బీటెక్ రవిని మీకు అప్పగిస్తున్నా. గెలిపించాలని కోరుతున్నా” అని పులివెందుల గడ్డ మీద నుంచి చంద్రబాబు అభ్యర్థించడం విశేషం. వైఎస్ కుటుంబంపై సుదీర్ఘ కాలం పాటు వేంపల్లికి చెందిన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి పోటీ చేస్తూ వచ్చారు. సతీష్‌రెడ్డి కుటుంబానికి నియోజకవర్గంలో సొంత ఇమేజ్ వుండింది. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌పై సతీష్‌రెడ్డి పోటీ చేశారు. అనేక కష్టనష్టాలను భరించారు. కానీ సతీష్‌రెడ్డికి టీడీపీ తగిన రీతిలో అండగా నిలచలేదు. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆయన రాజకీయంగా సైలెంట్ అయ్యారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఆయన్ను ఏకంగా పులివెందుల అభ్యర్థిగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇంతకూ ఎవరీ బీటెక్ రవి అనే చర్చ తెరపైకి వచ్చింది. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం కసనూరు బీటెక్ రవి స్వగ్రామం. మనోడు పబ్లిసిటీ పొందడంలో దిట్ట అని పులివెందుల ప్రజానీకం చెబుతోంది.
కసనూరులో ఇద్దరు రవీంద్రనాథ్‌రెడ్డిలున్నారు. దీంతో తన ఇంటి పేరుకు బదులు బీటెక్ అని రవి తగిలించుకున్నాడు. మరొక నాయకుడు కసనూరు రవిగా కడప జిల్లాలో పేరు పొందారు. ఇతను వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వుంటున్నారు.
బీటెక్ చదువును రవి అర్థంతరగా నిలిపేశారు. కసనూరు ఎంపీటీసీ అభ్యర్థిగా రెండుసార్లు నిలిచిన బీటెక్ రవి ఓటమి మూటకట్టుకున్నారు. 2006లో కసనూరు పంచాయతీకి జరిగిన ఎన్నికలు రవి రాజకీయ భవిష్యత్‌ను మార్చేశాయి. ఆ ఎన్నికల్లో రవి తన తమ్ముడు భరత్‌కుమార్‌రెడ్డిని బరిలో నిలిపారు. అటు వైపు వైఎస్సార్‌కు సన్నిహితుడైన కసనూరు రవి తన బామ్మర్ది శ్రీనాథ్‌రెడ్డిని పోటీ పెట్టారు. వైఎస్ జగన్‌ను పిల్లాడిగా కసనూరు రవి చిన్న చూపు చూశాడనే ప్రచారం వుంది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో నాటి సీఎం కుమారుడు వైఎస్ జగన్ తనకు గిట్టని కసనూరు రవికి వ్యతిరేకంగా బీటెక్ రవి తమ్ముడికి మద్దతు ఇచ్చాడని సమాచారం.
ఆ ఎన్నికల్లో బీటెక్ రవికి అక్షరాలా రూ.90 లక్షల సాయం అందినట్టు చెబుతారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో కసనూరు రవి నిలబెట్టిన అభ్యర్థిని ఓడించేందుకు ఓటుకు రూ.10 వేలు చొప్పున బీటెక్ పంచినట్టు కడప జిల్లాలో అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరికి జగన్ బలపరిచిన బీటెక్ రవి తమ్ముడు భరత్ 180 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపు బీటెక్ రవి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది.
వైఎస్ జగన్‌తో బీటెక్ రవి బంధం బలపడింది. వైఎస్ జగన్ సమీప బంధువు దుష్యంత్‌రెడ్డితో కలిసి బీటెక్ రవి తమ్ముడు బళ్లారిలో మైన్స్ వ్యాపారం చేశాడు. ఈ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు. సింహాద్రిపురం మండల నాయకుడిగా బీటెక్ రవి ఎదిగారు. అనంతరం కాలంలో హైదరాబాద్, బెంగళూరులో బీటెక్ వ్యాపారాలపై రకరకాల విమర్శలున్నాయి. ఏమైతేనేం ఆయన డబ్బు సంపాదించారు, సంపాదిస్తున్నారు.
టీడీపీ హయాంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని బీటెక్ రవి ఓడించారు. ఇందుకు మరోసారి వైఎస్ జగన్ సన్నిహితులైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, అలాగే వైఎస్ కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు రవికి దోహదపడ్డాయి. జగన్ పెంచిన రాజకీయ మొక్కే…నేడు ఆయనకు ప్రత్యర్థి కావడం కాలం తీసుకొచ్చిన మార్పుగా చెప్పొచ్చు.
జగన్‌కు దీటైన అభ్యర్థి బీటెక్ రవి అని చంద్రబాబు భావించారు. ఆయన్ను ప్రోత్సహిస్తున్నారు. తనకు గిట్టని కసనూరు రవిని అణచివేసేందుకు బీటెక్ రవిని జగన్ నాడు ప్రోత్సహించారు. ఇప్పుడు అతనే తనకు పులివెందులలో ప్రత్యర్థి అవుతాడని జగన్ అసలు ఊహించి వుండరు.