ఎంత పనిమంతుడు అయినా అధినాయకుడు పొగిడితేనే మజా ఉంటుంది. రాజకీయాల్లో అయితే ప్రశంసలు బహు తక్కువ. ఒక్కోసారి దక్కవు కూడా. విమర్శల జడివాన మాత్రం స్వపక్షం నుంచి మొదలుపెడితే విపక్షం దాకా అంతటా కురుస్తూనే ఉంటుంది.
నాలుగు ఏళ్లకు దగ్గర అవుతున్న వైసీపీ పాలనలో మంత్రులను పనిగట్టుకుని ముఖ్యమంత్రి జగన్ ఎక్కడా పొగిడినది లేదు. కానీ తాజా మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కితాబులు దక్కించుకున్న మంత్రులు ముగ్గురు ఉన్నారని తేలింది.
వారిలో అగ్రగణ్యుడు ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. మంత్రి వర్గ విస్తరణ జరిగి ఏడాదికి దగ్గరవుతున్న నేపధ్యంలో మంత్రుల పనితీరు మీద ఒక అంచనాకు జగన్ వచ్చినట్లుగా ఉన్నారు. ముగ్గురు మంత్రులు బాగా పనిచేస్తున్నారు అని ఆయన కోరి మరీ చెప్పారని తెలుస్తోంది.
బొత్స తరువాత వైద్య శాఖ మంత్రి విడదల రజని రెండవ స్థానంలో ఉంటే పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మూడవ మంత్రిగా ఉన్నారు.
వీరిలో బొత్స పనితీరుని జగన్ మెచ్చుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన విస్తరణలో తనకు విద్యా శాఖ లభించడం పట్ల మొదట్లో కొంత అసంతృప్తికి లోను అయ్యారని వార్తలు వచ్చాయి. విపక్షాలు సైతం బొత్సకు ఆ శాఖ ఏంటి అని ఎద్దేవా చేశాయి. కానీ బొత్స మాత్రం తన శాఖ పట్ల నిబద్ధత చూపించారు అని సీఎం వద్దకు చేరిన నివేదికలు తెలియచేస్తున్నాయి. అందుకే మంచి రేటింగ్ తో ఆయనకు ఈ ప్రశంసలు దక్కాయని అంటున్నారు.
ఇక రాజకీయంగా కూడా బొత్స చూస్తే చురుకుగా ఉన్నారు. ఉత్తరాంధ్రాలో బలమైన సామాజికవర్గానికి చెందిన ఆయన పార్టీ పటిష్టతకు దోహదపడుతున్నారని అంటున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడాలో అంతే మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న బొత్స తన పెద్దరికాన్ని చాటుకున్నారు. ఇపుడు జగన్ చేత పెద్దన్న అనిపించుకున్నారని అంటున్నారు.