జగన్ చెప్పడమేనా.. పాటించడం చేయరా?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తాజాగా ఒక ట్వీటు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. న్యాయం జరగడమే కాదు.. జరిగినట్లు కనిపించడం కూడా ముఖ్యం అని ఆయన తన ట్వీట్ లో సెలవిచ్చారు.…

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తాజాగా ఒక ట్వీటు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. న్యాయం జరగడమే కాదు.. జరిగినట్లు కనిపించడం కూడా ముఖ్యం అని ఆయన తన ట్వీట్ లో సెలవిచ్చారు. నిజమే ఇలాంటి మాటల అల్లికతో కూడిన నీతులు మనకు చాలా కనిపిస్తుంటాయి. జగన్ దానిని ఎన్నికలకు ముడిపెట్టి.. చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా కలుగుతున్న సందేహం ఏంటంటే.. ఇలాంటి సిద్ధాంతాన్ని తమ నాయకుడు చెప్పడం బాగుంది గానీ, దానిని ఆచరించడం ఆయనకు తెలుసునా అని అనుకుంటున్నారు.

జగన్ ముఖ్యమంత్రిగా అయిదేళ్లపాటు పనిచేశారు. ప్రజలు తనను మళ్లీ దీవిస్తారని, మరో ముప్పయ్యేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన నమ్మారు. తాను చాలా అద్భుతమైన పరిపాలన అందించానని కూడా ఆయన నమ్మారు. అయితే ఇక్కడ పార్టీ నాయకులు చెబుతున్న మాట ఏంటంటే.. అద్భుతమైన పాలన అందించడం మాత్రమే కాదు.. అలా మంచి పాలన చేస్తున్నట్టు కనిపించడం కూడా చాలా ముఖ్యం కదా! ఆ కనిపించడం గురించి జగన్ పట్టించుకోకపోవడం వల్లనే కదా.. ఇవాళ ఇంత దారుణ పరాజయం ఎదురైంది అని అంటున్నారు.

చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును గత ఏలుబడిలో దోపిడీకి ఒక మార్గంగా మార్చుకుంటే.. జగన్ తాను అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు మిగలబెట్టి.. వేరే సంస్థకు పనులు అప్పగించారు. తాజాగా పోలవరం ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. లోపాలు అన్నీ జగన్ మీదికి నెట్టేశారు. జగన్ వైఫల్యం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని నిందలు వేశారు.

అయితే ఇప్పుడు సాక్షి మీడియా వాటికి కౌంటర్లు ఇస్తోంది. ప్రాజెక్టు భద్రతకు జగన్ సర్కారు ఎలాంటి కృషి చేసిందో వివరిస్తోంది. అయితే ఈ టెక్నికల్ అంశాలన్నింటినీ.. చెప్పవలసింది ఇప్పుడు కాదు కదా. ఇదంతా ఉపయోగంలేని ప్రయాస!

నిజానికి రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పోలవరం విషయంలో జగన్ సర్కారు ఏయే చర్యలు తీసుకున్నదో ఎప్పటికప్పుడు ప్రజలకు చెబుతూ ఉంటే బాగుండేది. కానీ, జగన్ అయిదేళ్లలో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మామూలు ప్రెస్ మీట్లకే దిక్కులేదంటే.. ఇక పోలవరం మీద ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చెప్పడం అనేది ఆయననుంచి ఊహించలేం.

జగన్ సర్కారు ఏదైనా పనిచేసినా కూడా అది ప్రజల దృష్టికి వెళ్లలేదు. పనిచేయడం మాత్రమే కాదు.. పనిచేసినట్టు కనిపించడం కూడా ముఖ్యం. అందుకే ఇప్పుడు ఓడిపోయాం అని పార్టీ వారు అంటున్నారు.