ఆంద్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ కొలువు తీరింది. 21, 22 తేదీల్లో సభ్యుల ప్రమాణం నిమిత్తం సభను కొలువు తీర్చగా, తొలిరోజు శాసనసభ్యుల ప్రమాణాలు జరుగుతున్నాయి. కీలక నాయకులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, జగన్మోహన్ రెడ్డి తదితరులు ఇప్పటికే ఎమ్మెల్యేగా ప్రమాణం పూర్తిచేశారు. అయితే సభా కార్యక్రమాల తీరును గమనించిన వారికి.. ఈ శాసనసభలో కూర్చోవడం అసలు జగన్ కు ఇష్టమే లేదా? అనే అనుమానం కలుగుతోంది.
ప్రమాణ స్వీకారం చేయాలి గనుక ఈరోజు వచ్చారు సరే.. రేపటినుంచి జగన్ శాసనసభకు వస్తారా లేదా అని కూడా చర్చించుకుంటున్నారు. శుక్రవారం సభలో ఆయన వ్యవహార సరళి అలాగే ఉంది.
తాడేపల్లి లోని తన నివాసం నుంచి శాసనసభకు ఇదివరకు వచ్చే మార్గంలో కాకుండా మరో రోడ్డుగుండా వచ్చిన జగన్, అసెంబ్లీ వెనుక దారినుంచి సభలోకి వచ్చి వెనుక వరుసలో కూర్చున్నారు. ఆయనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇతర ఎమ్మెల్యేలు కొందరు అక్కడే కూర్చున్నారు.
సభలో ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పేరు పిలిచారు. ఆయన వచ్చి ప్రమాణం చేసిన తరువాత.. తెలుగుదేశం, కూటమి సభ్యులున్న వైపు తిరిగి నమస్కారం పెట్టి అభివాదం చేశారు. తర్వాత స్పీకరు పోడియం వద్దకు వెళ్లి ప్రొటెం స్పీకరు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అభివాదం చేశారు. అక్కడినుంచి వచ్చి సభలో కూర్చోకుండా నేరుగా బయటకు వెళ్లిపోయారు. డిప్యూటీ స్పీకరు చాంబర్ లో కొద్ది సేపు తన పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్న తరువాత.. ఆయన నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు.
ఈ తీరు గమనించిన వారికి.. అసలు ఈ శాసనసభలో కూర్చోవడమే జగన్ కు ఇష్టం లేదా అని చర్చించుకోవడం కనిపించింది. కేవలం 11 మంది సభ్యులున్న తమ పార్టీ శాసనసభలో ఉండి కూడా చేసేదేమీ లేదంటూ.. ఓడిపోయిన తొలిరోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పదేపదే అంటున్నారు.
గురువారం నాడు.. రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసిన అందరు ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం అయినప్పుడు కూడా.. ఆయన ఇదే మాట అన్నారు. ఈ సభలో ఉండలేం అని నిరాశగా మాట్లాడారు. ఇదంతా కేవలం నిర్వేదం అని మాత్రమే చూసినవారు అనుకున్నారు. అయితే ఆయనకు నిజంగానే సభలో కూర్చునే ఉద్దేశం లేదా? కేవలం ఎమ్మెల్యే హోదా మిస్ కాకుండా ఉండడానికి, ప్రమాణం చేసి ఇంటికి వెళ్లిపోయారా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.