జ‌గ‌న్‌కు వ‌జ్రాయుధం ఇచ్చిన రామోజీ

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఎల్లో మీడియా దిగ్గ‌జం రామోజీరావు క‌ట్టుక‌థ‌ల వంట‌కం స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలో రామోజీరావు సంధించిన బాణం …చంద్ర‌బాబుపైకి దూసుకెళ్లింది. ఈ ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు,…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఎల్లో మీడియా దిగ్గ‌జం రామోజీరావు క‌ట్టుక‌థ‌ల వంట‌కం స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలో రామోజీరావు సంధించిన బాణం …చంద్ర‌బాబుపైకి దూసుకెళ్లింది. ఈ ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు, రామోజీరావు ఊహించ‌లేదు. 

ఈనాడు క‌థ‌నాల‌ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని, ప్ర‌త్య‌ర్థిపైకి జ‌గ‌న్ సంధించారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లును నిలుపుద‌ల చేయాల‌ని చంద్ర‌బాబు త‌న ఎల్లో మీడియాతో డిమాండ్ చేయిస్తున్నార‌ని ఎదురుదాడికి దిగారు. ఇందుకు ఒంగోలు ఇవాళ జ‌రిగిన వైఎస్సార్ సున్నా వ‌డ్డీ ప‌థ‌కం ప్రారంభ స‌భ వేదికైంది.

ఒంగోలు స‌భ‌లో జ‌గ‌న్ చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామోజీ, టీవీ 5, ఏబీఎన్‌ల‌ను దుష్ట చ‌తుష్ట‌యంగా అభివ‌ర్ణించారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను నిలుపుద‌ల చేయాల‌ని త‌న ప‌త్రిక ఈనాడు ద్వారా చంద్ర‌బాబు డిమాండ్ చేస్తున్నార‌ని, దీన్ని అంగీక‌రిస్తారా? అని ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అంగీక‌రించేది లేదంటూ ప్ర‌జ‌లు చేతులు తిప్పుతూ గ‌ట్టిగా నిన‌దించ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పొచ్చు.

ఒంగోలు స‌భ‌లో జ‌గ‌న్ ఏం మాట్లాడారో ఆయ‌న మాట‌ల్లోనే…

“సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో 1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టాం. ఎక్కడా లంచాలకు తావులేకుండా లబ్ధిదారులకు మేలు జరిగింది. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపలేదు. నా ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఎవ‌రికీ చెప్పుకోలేదు. నా ఇబ్బందుల కంటే మీ ఇబ్బందులే ఎక్కువ‌నుకున్నా. మీ ఇబ్బందులే నా ఇబ్బందులుగా భావించాను. 

ఇంత మంచి జరుగుతున్నా బాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోంది. దుష్టచతుష్టయం అంటే చంద్రబాబు, రామోజీరావు, ఏబీఎన్‌, టీవీ5. వీళ్లంద‌రిది ఒకే మాట ఒకే బాట‌. ఈ దుష్ట‌చ‌తుష్ట‌యానికి ద‌త్త‌పుత్రుడు తోడ‌య్యాడు. వీళ్లంతా క‌లిసి ఏం మాట్లాడుతున్నారో గ‌మ‌నించాల‌ని కోరుతున్నా. ఇదిగో ఈనాడు ప‌త్రిక‌. ప్ర‌భుత్వం డ‌బ్బు పంచే త‌మాషాలు ఇక ఆపాల‌ట‌. మ‌రో శ్రీ‌లంక‌గా రాష్ట్రం. ఉచితంతో ఆర్థిక విధ్వంసం.  

ఇలా దుష్ట‌చ‌తుష్ట‌య‌మంతా క‌లిసి రాస్తా వున్నారు. నేను అడుగున్నా… అక్క‌చెల్లెమ్మ‌లు, రైతులు, చ‌దువుకుంటున్న పిల్ల‌లు, అవ్వాతాత‌ల‌కు, పేద‌రికంతో అల‌మ‌టిస్తున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్ర‌వ‌ర్ణాల్లో ఉన్న పేద‌ల‌కు ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డానికి వీల్లేద‌ట‌. రోజూ వీళ్లంతా చేస్తున్న ప్ర‌చారం ఇదే. తెలుగుదేశం పార్టీ చెప్ప‌ద‌లుచుకున్న‌ది వారి అధికార గెజిట్ పేప‌ర్ ఈనాడులో రాస్తారు. వారి మ‌న‌సులో ఉన్న‌ది ఈనాడులో ప్ర‌చురిస్తారు. 

ఇలా రాయిస్తారు. నేను అడుగుతున్న ఈ రాత‌ల అర్థం ఏంట‌ని? వీటి అర్థం నా పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ ఆపేయాల‌ని. ఆ ఎల్లో పార్టీ, మీడియా, ఎల్లో ద‌త్త‌పుత్రుడు అంతా ఏక‌మ‌య్యారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తే రాష్ట్రం శ్రీ‌లంక అవుతుంద‌ట‌. ఎల్లో బ్యాచ్ అంతా గోబెల్స్ ప్ర‌చారం చేస్తోంది. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబులా పక్కన పడేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ పథకాలను ఆపేయాలని టీడీపీ నేతలు అంటున్నారు. పేదలకు మంచి చేయొద్దని అంటున్నారు. ఇలాంటి రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నామని” సీఎం విరుచుకుప‌డ్డారు.

సంక్షేమ ప‌థ‌కాలను నిలుపుద‌ల చేయాల‌నే ఎల్లో బ్యాచ్ డిమాండ్‌నే ఆయుధంగా చేసుకుని టీడీపీపై యుద్ధానికి జ‌గ‌న్ సిద్ధ‌మ‌య్యారు. పేద‌ల‌కు టీడీపీ శ‌త్రువు అని న‌మ్మేలా ఎల్లో మీడియా రాత‌ల‌నే జ‌గ‌న్ ఆయుధంగా చేసుకున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం వ‌ల్ల రాష్ట్రం స‌ర్వ‌నాశ‌న‌మ‌వుతోంద‌ని ఒక వ‌ర్గంలో ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెంచేందుకు ఎల్లో మీడియాను చంద్ర‌బాబు ప్ర‌యోగానికి పెట్టారు. 

అదే ప్ర‌యోగాన్ని జ‌గ‌న్ రివ‌ర్స్‌లో చంద్ర‌బాబుపై చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పొచ్చు. వ్య‌తిరేక‌త కంటే భ‌యాన్ని పుట్టించ‌డం సుల‌భం. టీడీపీ ప్ర‌భుత్వం వ‌స్తే సంక్షేమ ప‌థ‌కాలేవీ ఉండ‌వ‌ని ఇప్ప‌టి నుంచే జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ఎదురుదాడికి దిగ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.