జ‌గ‌న్ స‌ర్కార్ కామెడీ

గ్రామ పంచాయ‌తీల‌కు రాష్ట్రస్థాయి పుర‌స్కారాల పేరుతో జ‌గ‌న్ స‌ర్కార్ కామెడీ చేస్తోంది. పంచాయ‌తీల నిధుల‌న్నింటినీ సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ళ్లించి, స్థానిక సంస్థ‌ల్ని నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ఈ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంది. గ్రామ పంచాయ‌తీల ఖాతాల్లో…

గ్రామ పంచాయ‌తీల‌కు రాష్ట్రస్థాయి పుర‌స్కారాల పేరుతో జ‌గ‌న్ స‌ర్కార్ కామెడీ చేస్తోంది. పంచాయ‌తీల నిధుల‌న్నింటినీ సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ళ్లించి, స్థానిక సంస్థ‌ల్ని నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ఈ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంది. గ్రామ పంచాయ‌తీల ఖాతాల్లో న‌యా పైసా కూడా లేక‌పోవ‌డంతో క‌నీసం వీధిలైట్ల‌ను కూడా వేసుకోలేని దుస్థితి. గ‌తంలో గ్రామ పంచాయ‌తీల‌కు ఎప్పుడూ ఈ దుస్థితి ఏర్ప‌డలేదు.

పేరుకే స‌ర్పంచులు త‌ప్ప‌, ఆర్థికంగా పంచాయ‌తీలు దివాళా తీయ‌డంతో అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థ‌లు నేత‌లు సైతం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇటీవ‌ల గ్రామ పంచాయ‌తీల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ‌స్థాయి పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. వాటిలో ఒక్క‌టి కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పంచాయ‌తీల‌కు రాక‌పోవ‌డం చూస్తే… మ‌న గ్రామీణ వ్య‌వ‌స్థ‌ల దుర‌వ‌స్థ‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం ఏప్రిల్‌ 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని 27 గ్రామ పంచాయ‌తీల‌ను రాష్ట్ర‌స్థాయి పుర‌స్కారాల‌కు ఎంపిక చేసింది. వీటిలో పేద‌రిక నిర్మూల‌న‌-ఉపాధి అవ‌కాశాలు క‌ల్ప‌న , ఆరోగ్య‌ పంచాయ‌తీ, చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయ‌తీ, నీటి సౌక‌ర్యం పుష్క‌లంగా ఉన్న పంచాయ‌తీ, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయ‌తీ, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయ‌తీ త‌దిత‌ర విభాగాలున్నాయి. 

కేవ‌లం జాతీయ పంచాయ‌తీరాజ్ దినాన్ని పుర‌స్క‌రించుకుని, ఏవో మొక్కుబ‌డిగా పుర‌స్కారాలు ఇవ్వాల‌నే త‌ప‌న త‌ప్ప‌, పంచాయ‌తీల‌ను ఉద్ద‌రించాల‌నే ఉద్దేశం ఈ ప్ర‌భుత్వానికి లేనే లేద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  

పంచాయ‌తీల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన నిధుల‌ను ఏపీ ప్ర‌భుత్వం లాక్కుంద‌ని స‌ర్పంచులు ల‌బోదిబోబంటున్న సంగ‌తి తెలిసిందే. పంచాయ‌తీల ఖాళీ ఖ‌జానాతో ఏం చేయాల‌ని అధికార పార్టీ సర్పంచులు సైతం నిల‌దీస్తున్నారు. ఈ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్ల చేసేందుకు చేతిలో నిధులు లేక ఉత్స‌వ విగ్ర‌హాలుగా త‌యార‌య్యామ‌ని స‌ర్పంచులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం ఏ ర‌కంగా పుర‌స్కారాల‌కు ఎంపిక చేసిందో అధికారుల‌కే తెలియాలి.