అనుకున్నట్టుగానే అనం రామనారాయణరెడ్డికి చెక్ పెట్టారు. నేదురుమల్లి రాంకుమార్‌ను వెంకటగిరి ఇన్‌చార్జ్‌గా తేల్చేసారు. అయితే శ్రీధర్‌రెడ్డికి వచ్చిన పిలుపు ఆనంకి ఎందుకు రాలేదు? అదే జగన్ స్టైల్. పార్టీ పెట్టినప్పటి నుంచి వృద్ధ లగేజీని జగన్ ఇష్టపడడం లేదు. అందుకే వైఎస్ సన్నిహితులు ఎక్కువ మంది పార్టీలో లేరు. ఉన్నవాళ్లు కూడా జగన్ నాయకత్వాన్ని ఆమోదించి, అంగీకరించి వుంటున్న వాళ్లే. తాము సీనియర్లం, తమకి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటే కుదరదు. ఆనంకి ఈ సూక్ష్మం అర్థం కాలేదు. తనకంటే బాగా జూనియర్లు అయిన అనిల్, కాకాణికి మంత్రి పదవులు ఇచ్చి తనని పక్కన పెట్టారనే బాధ ఆయనలో వుంది. అందుకే ఆ అసంతృప్తి, ఇన్‌డైరెక్ట్‌గా బయటపడుతూ వచ్చింది.
ఆనం మాట్లాడిన మాటల్లో వాస్తవం వుండొచ్చు. అభివృద్ధి జరగడం లేదు, పెన్షన్లు, పథకాలు ఇస్తే ఓట్లు పడతాయా? అనేది న్యాయమైన ప్రశ్న కూడా. అయితే శాసనసభ్యుడిగా వుంటూ సొంత ప్రభుత్వాన్ని పబ్లిక్‌గా విమర్శించడం కరెక్టా? రోడ్లు బాగా లేవని మిగతా ఎమ్మెల్యేలకి తెలియదా? ఎవరూ మాట్లాడ్డం లేదు కదా! ప్రాంతీయ పార్టీల్లో నాయకుడి ఆలోచనలకి అనుగుణంగానే మాట్లాడాలి.
జాతీయ పార్టీల సంగతి వేరు. అధిష్టానం ఢిల్లీలో వుంటుంది కాబట్టి ప్రజాస్వామ్యం అతిగానే వుంటుంది. కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టడానికి కారణం ఇదే. జగన్ మీద తప్పుడు సమాచారం మోసి , తన సీటు కూడా గెలవలేని కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసారు.
వైసీపీ జగన్ సొంత పార్టీ. ఆయన రెక్కల మీద ఎదిగింది. జగన్ వల్ల చాలా మంది నాయకులు గెలిచారే కానీ, నాయకుల వల్ల జగన్ గెలవలేదు. ఒంటరి పోరాటానికి సిద్ధపడే పార్టీ పెట్టాడు కాబట్టి జగన్ పనిగట్టుకుని పాత నాయకుల్ని ఆహ్వానించలేదు. వచ్చిన వాళ్లకి టికెట్లు ఇచ్చాడు. అంతే.
జగన్ కొత్త నాయకుల్ని తయారు చేసుకున్నాడు. మంత్రి పదవుల్లో కూడా ఆయన ప్రయార్టీస్ వేరు. అనంతపురం జిల్లాలో సీనియారిటీ తీసుకుంటే అనంత వెంకట్రామిరెడ్డికి ఇవ్వాలి. కానీ తొలిసారి ఎమ్మెల్యేలు అయిన శంకర్‌నారాయణ, ఉషశ్రీలకి పదవులు దక్కాయి. అనేక జిల్లాల్లో ఇదే జరిగింది. పెద్దిరెడ్డి, బొత్స లాంటి ఒకరిద్దరు తప్ప పాత నాయకులు లేరు.
నెల్లూరులో ఆనం ఇది అర్థం చేసుకోలేదు. కాలం మారింది. కొత్త నీళ్లు వచ్చాయి. వచ్చే ఎన్నికలకి ఆయన టీడీపీలో చేరొచ్చు. అయితే వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉన్నాడు. ఇంకో నియోజకవర్గానికి వెళితే అక్కడ టీడీపీలో ముఠా తగాదాలు బయల్దేరుతాయి.
ఈ ఎపిసోడ్ ద్వారా జగన్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. పదవుల్లో ఉండి విమర్శిస్తే సహించే ప్రశ్నే లేదని. ఎన్నికల సమయానికి ఈ జాబితా నిస్సందేహంగా పెరుగుతుంది.