జ‌గ‌న్‌…మీరు బ‌జ్జోండి!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ టీడీపీ చాలా యాక్టీవ్ అయ్యింది. టీడీపీ అధిప‌తి చంద్ర‌బాబునాయుడు తాను ముందుకు క‌దులుతూ, త‌న సైన్యాన్ని న‌డిపిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు కూడా స‌మ‌రోత్సాహంతో వైసీపీపై దూకుడు…

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ టీడీపీ చాలా యాక్టీవ్ అయ్యింది. టీడీపీ అధిప‌తి చంద్ర‌బాబునాయుడు తాను ముందుకు క‌దులుతూ, త‌న సైన్యాన్ని న‌డిపిస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నాయ‌కుల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు కూడా స‌మ‌రోత్సాహంతో వైసీపీపై దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం వినుకొండ‌లో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఘ‌ట‌నే. మ‌రోవైపు వైసీపీకి ఏకైక బ‌ల‌మైన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇంకా స‌మ‌రానికి స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు.

తాడేప‌ల్లిలో త‌న నివాసంలో వుంటూ ఏవో వ్యూహాలు ర‌చిస్తున్నారని వైసీపీ నాయకులు సంతృప్తి చెంద‌డం త‌ప్ప‌, ఆచ‌ర‌ణ‌లో అంత జోష్ క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే నారా లోకేశ్ ఆరు నెల‌లుగా జ‌నంలో గ‌డుపుతున్నారు. వైసీపీ ప్ర‌భుత్వంపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాము అధికారంలోకి వ‌స్తే… ఏఏ వ‌ర్గాల‌కు ఎలాంటి మంచి చేస్తామో ఆయ‌న చెబుతూ వ‌స్తున్నారు. ఇది టీడీపీకి ఎంతో కొంత లాభం క‌లిగించే అంశ‌మే.

తాజాగా సాగునీటి ప్రాజెక్టుల‌పై వైసీపీ ప్ర‌భుత్వం పూర్తిగా శీత‌క‌న్ను వేసింద‌ని చంద్ర‌బాబు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా చిత‌క్కొట్ట‌డం చూశాం. చంద్ర‌బాబు చెబుతున్న దాంట్లో చాలా వ‌ర‌కు అబ‌ద్ధాలున్నాయ‌ని సాగునీటి నిపుణులు ఆఫ్ ది రికార్డుగా చెప్ప‌డ‌మే త‌ప్ప‌, వైసీపీ ప్ర‌భుత్వానికి తామెందుకు ఉప‌యోగ‌ప‌డాల‌నే ఉద్దేశంతో వారంతా మౌనాన్ని ఆశ్ర‌యించారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వం సాగునీటి ప్రాజెక్టుపై పూర్తిగా నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శించింద‌ని భావ‌న , వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లో నెమ్మ‌దిగా క‌లుగుతోంది. ఇది రాజ‌కీయంగా వైసీపీకి న‌ష్టం క‌లిగించేదే.

ఇలా వైసీపీపై వ్య‌తిరేక‌త పెంచే చ‌ర్య‌ల‌ను టీడీపీ వేగ‌వంతం చేస్తోంది. ఈ క్ర‌మంలో ‘పెన్నా టు వంశధార’ పేరుతో చంద్ర‌బాబు నాయుడు ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌కు ఆగ‌స్టు ఒక‌టి నుంచి శ్రీ‌కారం చుట్ట‌డం విశేషం. నిజానికి వ్య‌వ‌సాయ వ్య‌తిరేకిగా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబును చూసే ప‌రిస్థితి. అలాంటిది చంద్ర‌బాబు తాను సాగునీటి ప్రాజెక్టుల రూప‌క‌ర్త‌గా, నిర్మాణ సార‌థిగా ఆవిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ఇదంతా జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌నా వైఫ‌ల్య‌మే కార‌ణ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. చంద్ర‌బాబునాయుడు వ‌రుస‌గా ప్రెస్‌మీట్‌లు నిర్వ‌హిస్తూ, వైసీపీ ప్ర‌భుత్వం సాగునీటి ప్రాజెక్టుల‌పై ఏ మాత్రం శ్ర‌ద్ధ చూప‌డం లేద‌ని, త‌మ‌తో పోల్చుకుంటే జ‌గ‌న్ స‌ర్కార్ ఖ‌ర్చు చేసింది చాలా త‌క్కువ‌ని చెబుతున్నా… అటు వైపు నుంచి స‌రైన కౌంట‌ర్లు లేవు. ఇదే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారాహి యాత్ర‌లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తే… వెంట‌నే దాడి చేయ‌డానికి అన్న‌ట్టు రావ‌డం చూశాం.

ప‌వ‌న్‌పై ప్ర‌ద‌ర్శిస్తున్న దూకుడు, సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో చంద్ర‌బాబుపై ఎందుకు చేయ‌లేక‌పోతున్నార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఎందుకంటే సాగునీటి రంగానికి వ‌చ్చే స‌రికి… లెక్క‌ల‌తో స‌హా వివ‌రించాల్సి వుంటుంది. ప‌క్కాగా వివ‌రించ‌డానికి త‌గిన తెలివితేట‌లు వైసీపీ కేబినెట్‌లోనూ, స‌ల‌హాదారుల్లోనూ మ‌చ్చుకైనా లేరు. జాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వే నివేదిక‌ల్లో మ‌ళ్లీ ఏపీలో వైసీపీదే హ‌వా అని చెబుతుంటే…వాటిని నిజ‌మే అని న‌మ్మి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రిలాక్ష్ అవుతున్న‌ట్టున్నారు.

స‌ర్వేలు వేరు, రియాల్టీ వేర‌ని జ‌గ‌న్ ఎంత త్వ‌రగా గ‌మ‌నిస్తే ఆయ‌న‌కే అంత మంచిది. ఒక‌వైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు , మ‌రోవైపు ప‌వ‌న్‌క‌ల్యాణ్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ, వైసీపీ స‌ర్కార్‌పై విషం చిమ్ముతున్నారు. తిప్పికొట్టాల‌న్న స్పృహ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌లో కొర‌వ‌డింద‌నే విమ‌ర్శ లేక‌పోలేదు. అప్పుడ‌ప్పుడు బ‌ట‌న్ నొక్క‌డానికి వెళ్లి… ప‌వ‌న్ పెళ్లాలు, దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ అరిగిపోయిన విమ‌ర్శ‌ల‌కు ప‌రిమితం అవుతున్నారు. 

చంద్ర‌బాబునాయుడు త‌న పంథాను మార్చుకుని విధానాల ప‌రంగా వైసీపీ స‌ర్కార్‌ను వీధిన నిల‌బెడుతున్నారు. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టే యంత్రాంగం అధికార పార్టీలో కొర‌వ‌డింది. ఎన్నిక‌ల స‌మ‌రానికి స‌న్న‌ద్ధం చేయాల్సిన జ‌గ‌నే, నిద్ర‌పోతున్న‌ట్టుగా వుంటే, ఇక వైసీపీ శ్రేణుల్ని ముందుకు న‌డిపించేదెవ‌ర‌ని ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి. జ‌గ‌న్‌…మీరు బ‌జ్జోండి, చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌లిసి ల‌క్ష్యం వైపు సాగుతుంటార‌ని సొంత పార్టీ నేత‌లు నిరాశ‌తో అంటున్నారు.