జగన్ దృష్టిలో పడిన అనిల్-కాకాణి లొల్లి

వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో ఇద్దరు నేతలు గొడవ పడటం, వారికి జగన్ సర్ది చెప్పడం వంటి సంఘటనలు చాలా తక్కువ. అందులోనూ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవ్వరూ ఎక్కడా నోరు మెదిపిన దాఖలాలు…

వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో ఇద్దరు నేతలు గొడవ పడటం, వారికి జగన్ సర్ది చెప్పడం వంటి సంఘటనలు చాలా తక్కువ. అందులోనూ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవ్వరూ ఎక్కడా నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఇటీవల మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంలో కాస్త అసంతృప్తి బయటపడినా.. రోజుల వ్యవధిలోనే అంతా సెట్ రైట్ అయింది. అయితే నెల్లూరులో మాత్రం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చిచ్చు పెట్టింది.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, తాజా మంత్రి కాకాణి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫ్లెక్సీలు చినిగాయి. నెల్లూరు వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. అనిల్ ఒక్కరే ఒకవైపు, మిగతా వారంతా కాకాణి వైపు అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. రోజురోజుకీ వ్యవహారం ముదురుతోంది. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో సీఎం జగన్ నేరుగా కలుగజేసుకున్నారు. అనిల్, కాకాణి ఇద్దరికీ క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది.

ఇప్పటికే ఓసారి మాజీ మంత్రి బొత్స వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. కాకాణి స్వాగత ర్యాలీ రోజే అనిల్ నెల్లూరు సిటీలో సభ పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకేరోజు జరక్కుండా చూడాలని సీనియర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా వ్యవహారం ముదిరింది. దీంతో నేరుగా సీఎం జగన్ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది.

మొన్నటివరకు ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చలేదు జగన్. పార్టీకి తక్కువ, ప్రజా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడిప్పుడే పార్టీపై మరోసారి దృష్టి పెడుతున్న ముఖ్యమంత్రి.. ఈ అసమ్మతిని మొగ్గలోనే తుంచేయాలని అనుకుంటున్నారు. లేకపోతే ఇది మిగతా జిల్లాలకు పాకే ప్రమాదం ఉంది. అందుకే జగన్ నేరుగా జోక్యం చేసుకున్నారు. ఈరోజు ఇద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడబోతున్నారు.