విజన్ విశాఖ పేరుతో వైజాగ్ లో ఏర్పాటు చేసిన గ్లోబల్ మీట్ ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పేలా చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విపక్షాలకు దిమ్మదిరిగేలా స్టేట్మెంట్ ఇచ్చారు. విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించారు. ఇది అనివార్యం అని కూడా అందుకు గల కారణాలు కూడా వివరించారు.
విశాఖ మీద తన కమిట్మెంట్ ఏంటి అన్నది ఆయన చెబుతూ తాను రెండవ సారి సీఎంగా విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని ఎలుగెత్తి చాటారు. విశాఖలోనే తన నివాసం అని కూడా విపక్షాలకు నోట మాట రాకుండా చేశారు.
ఇపుడైతే కోర్టు కేసులతో ఆటంకం కలిగించవచ్చు, ఎన్నికల తరువాత మాత్రం ఎవరూ విశాఖను రాజధానిగా చేసే ప్రయత్నాలను అడ్డుకోలేరన్న నిబ్బరంతో ముఖ్యమంత్రి ప్రకటించారు. విశాఖ హైదరాబాద్ కి సరిసాటి నగరం. ఏపీకి ఎకనామిక్ గ్రోత్ ఇంజన్. విశాఖ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతోంది.
మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. విశాఖకు ఎంతో కొంత మెరుగులు దిద్దితే అద్భుతమైన క్యాపిటల్ అవుతుంది. అమరావతి మీద నాకు కోపం లేదు విశాఖ అభివృద్ధితో ఏపీ బాగుపడుతుంది. భావి తరాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుంది అని తన విజన్ సీఎం జగన్ ప్రకటించారు.
విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం తొందరలో నిర్మించబోయే రాష్ట్ర సచివాలయం ఐకానిక్ నమూనాను కూడా ముఖ్యమంత్రి విడుదల చేశారు. దేశానికే ఐకానిక్ గా ఉండేలా విశాఖలో సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జగన్ స్పష్టం చేశారు.
ఈ ఐకానిక్ సచివాలయం చుట్టూఒ పచ్చదనం ఉంటుంది. రెండు టవర్లు కలిపి ఉండేలా రూపొందించారు దీనికి ఎక్కడ నిర్మిసారు ఎంత ఖర్చు చేస్తారు అన్నది ప్రభుత్వం తొందరలోనే వెల్లడిస్తుంది. విశాఖకు మంగళవారం వచ్చిన ముఖ్యమంత్రి విశాఖ రాజధానిగా ఉంటుందని ఫుల్ కమిట్మెంట్ తో ప్రకటన చేశారు.
ఇందులో రెండవ మాటకు తావు లేదు అన్నారు. అమరావతి రాజధాని నిర్మించాలంటే లక్ష కోట్లు ఈ రోజు బడ్జెట్, అది పూర్తి అవాలంటే కనీసంగా ఇరవై ఏళ్ల పైదాటుతుంది. అప్పటికి పదిహేను లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఇంత మొత్తం ఎక్కడ నుంచి తెస్తామని జగన్ ప్రశ్నించారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, దాని ప్రాధాన్యత దానికి ఉంటుందని జగన్ చెప్పారు.
విశాఖ పర్యటనలో జగన్ చేసిన ఈ ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తంది. విశాఖ రాజధాని అని ముఖ్యమంత్రి ప్రకటించాక విపక్షం ఉత్తరాంధ్రా రాజకీయాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ఏమి చేస్తుంది అన్నది ఇపుడు అతి పెద్ద ప్రశ్నగా ఉంది. ఎన్నికల వేళ జగన్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారని అంటున్నారు.