ఆయన జనసేనలో కీలక నాయకుడు. పూర్వాశ్రమంలో కాంగ్రెస్ తరఫున విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడారు. జనసేనలో చేరి విశాఖలో ముఖ్య నాయకుడిగా ఉంటున్నారు. ఆయనే బొలిశెట్టి సత్యనారాయణ. ఆయనకు వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుస్తుంది అని నూటికి రెండు వందల శాతం నమ్మకం ఉందిట.
తాజాగా ఒక చానల్ లో జరిగిన డిబేట్ లో మాట్లాడుతూ వైసీపీ పాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఆ పార్టీని మళ్ళీ గెలిపించే సమస్య లేదని స్పష్టం చేశారు. ప్రజలు అంతా ఇపుడు పవన్ కళ్యాణ్ సారధ్యాన్ని కోరుకుంటున్నారు అని ఆయన విశ్లేషించారు.
పవన్ కళ్యాణ్ 2019లో పోటీ చేసినా ఆయన మీద జరిగిన విపరీతమైన తప్పుడు ప్రచారానికే ఓడిపోయారని అంటున్నారు. ఈ నాలుగేళ్ళలో పవన్ మీద మోజు పెరిగిందని, జనసేన సిద్ధాంతాలు ఏంటి అన్నది జనాలకు తెలిసాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా జనసేన కచ్చితంగా గెలిచి తీరుతుందని బొలిశెట్టి చెబుతున్నారు. ఏపీ రాజకీయాల్లో మూడవ రాజకీయ పార్టీ రాకుండా లేకుండా చేయాలని అంతా చూస్తున్నారని, ఈసారి అలాంటి వాటిని జనం అసలు సహించరని, తప్పకుండా పవన్ని ఎన్నుకుంటారని బొలిశెట్టి ఆశాభావం వ్యత్కం చేశారు.
అయితే అదే డిబేట్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా ఒంటరిగా పోటీ చేస్తారా అన్న దానికి మాత్రం బొలిశెట్టి సూటింగా సమాధానం చెప్పకపోవడం విశేషం. ఏమైనా సైనికులలో ధీమా ఉండాల్సిందే అని అంతా అంటున్నారు. వైసీపీ నేతలు అయితే పగటి కలలు కంటూ ఉండండి అని సెటైర్లు వేస్తున్నారు.