భీమిలీలో టీడీపీకి జనసేన షాక్

విశాఖ జిల్లా భీమునిపట్నం సీటు ఇపుడు అందరికీ స్వీట్ గా ఉంది. టీడీపీ ఈ సీటు నుంచి 2024లో పోటీ చేయాలని చూస్తోంది. దాని కంటే ముందే ఈ సీటు మీద జనసేన కర్చీఫ్…

విశాఖ జిల్లా భీమునిపట్నం సీటు ఇపుడు అందరికీ స్వీట్ గా ఉంది. టీడీపీ ఈ సీటు నుంచి 2024లో పోటీ చేయాలని చూస్తోంది. దాని కంటే ముందే ఈ సీటు మీద జనసేన కర్చీఫ్ వేసేసింది. ప్రచారంలోకి దిగిపోతోంది. భీమిలీలో జనసేన ప్రచార కార్యక్రమాన్ని ఈ నెల 30 నుంచి మొదలెడుతున్నట్లుగా ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పంచకర్ల సందీప్ తెలిపారు. ఇంటింటికీ వెళ్ళి జనంతో జనసేన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని ఆయన మీడియాకు చెప్పారు.

గత ఎన్నికల్లో జనసేనకు భీమిలీలో 24 వేల ఓట్లు వచ్చాయని ఆయన చెబుతున్నారు. ఈసారి తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఓడినా నాలుగేళ్ళుగా జనంలోనే తాము ఉన్నామని ప్రజా సమస్యల మీద ప్రతిపక్షంగా అలుపెరగని పోరాటం చేశామని పంచకర్ల చెప్పారు.

భీమిలీలో జనసేనను బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి ఒక మాజీ మంత్రితో పాటు కీలక నేతలు అంతా పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఇపుడు చూస్తే జనసేన రంగంలోకి దిగడమే కాకుండా పోటీకి తయారుగా ఉంది. జనసేన ఈ సీటుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

పవన్ కళ్యాణ్ సైతం జనసేన జెండా భీమిలీలో ఎగరాలని కొద్ది నెలల క్రితం మంగళగిరిలో జరిగిన పార్టీ సమీక్షలో కోరారు. ఇపుడు తెలుగుదేశంలో ఆశావహులకు ఇది షాక్ అని అంటున్నారు.