వైఎస్సార్టీపీ అధినేత్రి, సీఎం జగన్ సోదరి షర్మిలకు ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్ కౌంటర్ ఇచ్చారు. కాస్త వ్యంగ్యం జోడించి ఆమెకు గట్టి సమాధానం ఇచ్చారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి, డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. షర్మిలమ్మ కామెంట్స్ ఏపీ ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టైంది.
ఈ నేపథ్యంలో తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా షర్మిలను మంత్రి జోగి రమేశ్ తప్పు పట్టారు. ఆమె అలా మాట్లాడి వుండాల్సింది కాదని స్పష్టం చేశారు. జోగి రమేశ్ మీడియాతో మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణపై విరుచుకు పడ్డారు. కన్న తండ్రి ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడు బాలకృష్ణ ఏం చేశారని ప్రశ్నించారు. పార్టీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ నవ్వుతూ నిలబడలేదా అని నిలదీశారు. మీ కుటుంబంలో బాబు పెట్టిన చిచ్చు మర్చిపోయావా? అని ప్రశ్నించారు.
ఇదే సందర్భంలో షర్మిలకు కూడా జోగి రమేశ్ కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. జోగి రమేశ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“నాకు తెలిసి షర్మిలమ్మ అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డి ప్రసంగం విని వుండరు. విని వుంటే అట్లా మాట్లాడి ఉండేవారు కాదు. జగన్ ప్రసంగం ఆమె విన్నారో లేదో నాకు తెలియదు. అక్కడి (తెలంగాణ) పరిస్థితులు కూడా వేరు కదా పాపం. షర్మిలమ్మ ఆ రాష్ట్రంలో ఉన్నారు. అక్కడ ఏ పరిస్థితులు ఏమున్నాయో తెలియదు. కానీ జగన్ ప్రసంగం విని వుంటే మాత్రం ఆ మాట అని ఉండదని అనుకుంటున్నా” అని సున్నితంగా మొట్టికాయలు వేశారు.
షర్మిలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో పాపం, అక్కడి పరిస్థితులేంటో లాంటి పదాలు వెటకారం ధోరణిలో మంత్రి అన్నవే. బహుశా షర్మిలకు వైసీపీ ముఖ్య నేతల నుంచి వచ్చిన మొదటి కౌంటర్ కూడా ఇదే కావచ్చు. షర్మిల మరోసారి ఏపీ రాజకీయాలపై జోక్యం చేసుకుని, జగన్కు నష్టం కలిగిస్తే మాత్రం గట్టి కౌంటర్ తప్పదనే హెచ్చరికను మంత్రి జోగి రమేశ్ రూపంలో ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.