టీడీపీపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లపై మంత్రి జోగి రమేష్ ఒంటికాలిపై లేస్తుంటారు.
కరకట్టపై నివాసం ఉన్న చంద్రబాబు ఇంటిపైకి ఎమ్మెల్యేగా జోగి రమేష్ వెళ్లడం అప్పట్లో వివాదమైంది. ఆ ఘటనే జోగికి మంత్రి పదవి వచ్చేలా చేసిందని ప్రతిపక్షాలు విమర్శించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి భవిష్యత్ లేదని మంత్రి జోగి రమేష్ జోష్యం చెప్పడం విశేషం. ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఏఎస్‌పేట మండలంలో పర్యటించారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ బలీయమైన శక్తిగా ఎదిగిందన్నారు. టీడీపీ ఆరిపోయే దీపమని అభివర్ణించారు. కడప జిల్లా బద్వేల్ తరహాలోనే ఆత్మకూరులో కూడా వైసీపీ భారీ మెజార్టీని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
టీడీపీ పోటీ నుంచి తప్పుకున్నా, బీజేపీకి లోపాయికారి మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి అలవాటే అని విమర్శించారు. జన్మభూమి కమిటీతో చంద్రబాబు రాష్ట్రాన్ని కర్మభూమిగా మార్చారని విమర్శించారు. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్రం పయనిస్తోందని మంత్రి జోగి రమేష్ చెప్పుకొచ్చారు.