ప్రసిద్ధ ఆలయాలను ప్రముఖులు సందర్శించడం సహజం. కానీ సాధారణ ఆలయాల్ని సందర్శించే ప్రముఖుల గురించి తక్కువగా వింటుంటాం. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ప్రసిద్ధ గ్రామ దేవత. సుమారు 900 సంవత్సరాల క్రితం అనంత శయనం అయ్యంగార్లు గ్రామదేవత కొలువుదీరిన తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని నిర్మించారు.
అలాంటి ప్రసిద్ధ గ్రామదేవత ఆలయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు సందర్శించారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి గురువారం సాయంత్రం తన స్నేహితుడు, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలిసి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం విశేషం.
ఎన్వీ రమణ దంపతులకు ఎమ్మెల్యే భూమన, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్, ఆలయ చైర్మన్ గోపి యాదవ్, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఎన్వీ రమణ దంపతులు ఆలయంలో కలియతిరిగారు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరునికి తాతయ్యగుంట గంగమ్మ స్వయాన చెల్లి అని చెబుతారు. ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉన్న విషయాన్ని ఎన్వీ రమణ తెలుసుకున్నారు. గ్రామ దేవతలకు మొదటిసారిగా జాతరను నిర్వహించడం తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నుంచే ప్రారంభమైంది.
ఆ తర్వాత జాతరలో భాగంగా అమ్మవారికి సారె ఇచ్చే సంప్రదాయం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతారు. ఇలాంటి అనేక విశేషాలున్న ఆలయం గురించి తెలుసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.