ఎన్టీఆర్ కేంద్రంగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్టీఆర్ అనే తేనెతుట్టెని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కదిపారు. తేనె టీగలు ఇష్టానుసారం కుడుతున్నాయి. మరోసారి ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన ద్రోహంపై విస్తృత చర్చకు జగన్ తెరలేపారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంపై కంటే, ఆయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడవడంపైన్నే ఎక్కువ చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు తొలగింపును టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు సృష్టించి, వాటిపై నానా యాగీ చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు అలవాటైందని విరుచుకుపడ్డారు. చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చలకు మాత్రం ప్రధాన ప్రతిపక్ష నేతలు ముందుకు రారని విమర్శించారు.
శాసనమండలిలో వ్యవసాయ రంగంపై చర్చ పెడితే, లోకేశ్ వ్యక్తిగత విమర్శలకి దిగే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. లోకేశ్ దగ్గర సబ్జెక్టు లేకపోవడం వల్లే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని విమర్శించారు. నిజంగా చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఎన్టీఆర్‌ని ఎన్నివిధాలా ఇబ్బందులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. దివంగత ఎన్టీఆర్ శ్రమతో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. నందమూరి కుటుంబానికి టీడీపీని ఎందుకు అప్పగించడం లేదని మంత్రి కాకాణి నిలదీశారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లో వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పుల దాడిని తెలుగు ప్రజలంతా గుర్తుపెట్టుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు అధికార దాహానికి తాను బలయ్యానని అనేక మార్లు ఎన్టీఆర్ బాధపడ్డ సంగతిని మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబుకి సిగ్గు, శరం వంటివి ఏవీ లేవని ఘాటు విమర్శ చేశారు. లోకేశ్ గడ్డం పెంచి పెద్ద పులిలా గర్జిస్తున్నాడని, ఎవరిని భయపెడుతావ్? అని మంత్రి ప్రశ్నించారు.