నారా లోకేశ్‌పై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విరుచుకపడ్డారు. పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో లోకేశ్ మాట్లాడుతూ కాకాణిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాకాణిని కోర్టు దొంగగా లోకేశ్ అభివర్ణించారు. కాకాణి 8 కేసుల్లో నిందితుడని, అందులో అక్రమ మద్యం కేసు కూడా ఉందని విమర్శించారు. ఈ మంత్రికి మద్యం మీద ఉన్న అవగాహన వ్యవసాయం మీద లేదని విమర్శించారు.
కాకాణి వల్ల నెల్లూరు జిల్లాలో ఒక్క రైతుకైనా న్యాయం జరిగిందా? అని లోకేశ్ ప్రశ్నించారు. నాలుగేళ్ల కాలంలో కాకాణి 3 వేల కోట్ల మింగాడని విమర్శించారు. వెంకటాచలంలో వేల ఎకరాల పేదల భూములు కొట్టేశాడని ఆరోపించారు. ఇవాళ కాకాణి మీడియాతో మాట్లాడుతూ లోకేశ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. పాదయాత్రను లోకేశ్ ఒక సర్కస్ కంపెనీలా నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేవలం మీడియా అటెన్షన్ కోసమే వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నాడని కాకాణి మండిపడ్డారు. తన తండ్రి చంద్రబాబునాయుడిపై ఉన్న కోపాన్ని వైసీపీ నేతలపై లోకేశ్ ప్రదర్శిస్తున్నారని వెటకరించారు. తాతకు వెన్నుపోటు పొడిచినట్టు తనకు పొడుస్తాడేమో అని చంద్రబాబు విషయంలో లోకేశ్ భయపడుతున్నారని కాకాణి విమర్శించారు. లోకేశ్‌కు భవిష్యత్ అర్థంకాని అయోమయ స్థితిలోకి వెళ్లారన్నారు.
మంగళగిరిలో లోకేశ్‌ను నిలబెట్టారని, అక్కడి ప్రజలు ఓడించారన్నారు. తానే గత ఎన్నికల్లో ఓడిపోయిన లోకేశ్, ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతూ టీడీపీ అభ్యర్థుల్ని గెలిపిస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన పేపర్లను చదువుతూ, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం మనవడిగా, కొడుకుగా లోకేశ్ చెప్పుకుంటున్నాడని, ఆయనకంటూ సొంత సత్తా లేదని విమర్శించారు.