బాబుపై క‌న్నా దూష‌ణ‌లు…సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌!

టీడీపీలో చేర‌డానికి మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సిద్ధ‌మ‌య్యారు. గురువారం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ప‌సుపు కండువా క‌ప్పుకోనున్నారు. బీజేపీని వీడిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏ పార్టీలో చేరాలో ఆయ‌న ఇష్టం. ఇందులో త‌ప్పు ప‌ట్ట‌డానికి…

టీడీపీలో చేర‌డానికి మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సిద్ధ‌మ‌య్యారు. గురువారం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ప‌సుపు కండువా క‌ప్పుకోనున్నారు. బీజేపీని వీడిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఏ పార్టీలో చేరాలో ఆయ‌న ఇష్టం. ఇందులో త‌ప్పు ప‌ట్ట‌డానికి కూడా ఏమీ లేదు. అయితే సుదీర్ఘ కాలం పాటు బాబుకు వ్య‌తిరేకంగా క‌న్నా రాజ‌కీయాలు న‌డిపారు. టీడీపీలో చేర‌నున్న నేప‌థ్యంలో, గ‌తంలో చంద్ర‌బాబు గురించి క‌న్నా చేసిన ఘాటు వ్యాఖ్య‌లు తెరపైకి వ‌చ్చాయి.

త‌న‌ను భౌతికంగా అంత‌మొందించ‌డానికి బాబు కుట్ర‌లు పన్నార‌ని, అలాగే వాడెవ‌డంటూ టీడీపీ అధినేత‌ను ఉద్దేశించి ఆవేశ పూరితంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నిన్ను చంప‌డానికి ప్ర‌య‌త్నించిన చంద్ర‌బాబు పంచ‌న ఏ మొహం పెట్టుకుని చేరుతున్నావ‌ని క‌న్నాను నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. గ‌తంలో వివిధ సంద‌ర్భాల్లో బాబుపై క‌న్నా చేసిన సీరియ‌స్ కామెంట్స్ గురించి తెలుసుకుందాం.

వారాంత‌పు ప‌లుకుల సార్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌న్నా ఏమ‌న్నారంటే…”గుంటూరు జిల్లాలో న‌న్ను, కృష్ణా జిల్లాలో వంగ‌వీటి రంగాను అంత‌మొందించాల‌ని చంద్ర‌బాబు అనుకున్నారు. ఎందుకంటే ప్ర‌త్య‌ర్థుల‌నే వాళ్లు లేకుండా, టీడీపీని బ‌లోపేతం చేసుకోడానికే. వంగ‌వీటి రంగా విష‌యంలో బాబు స‌క్సెస్ అయ్యారు. నా విష‌యంలో ఫెయిల్ అయ్యాడు. చంద్ర‌బాబును ఎన్టీఆర్ పిలిచి చీవాట్లు పెట్టిన‌ట్టు తెలిసింది” అని క‌న్నా వివ‌రించారు.

ఆ త‌ర్వాత మ‌రో జ‌ర్న‌లిస్టుకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పొత్తుపై క‌న్నా సీరియ‌స్ అయ్యారు. వాళ్లతో, వీళ్ల‌తో పొత్తు పెట్టుకుంటా మ‌ని చెప్ప‌డానికి వాడెవ‌డు? అమిత్‌షా స్ప‌ష్టంగా చెప్పిన త‌ర్వాత కూడా, చంద్ర‌బాబు చెప్పిన మాట‌కే మీడియా ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్న‌దో అర్థం కావ‌డం లేదు. అస‌లు వాడెవ‌డు (చంద్ర‌బాబు)మా పార్టీ గురించి మాట్లాడ్డానికి?” అని తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి.