ఇతరుల విషయాల్లో వేలు పెడితే ఏమవుతుందో సినీ నటి కరాటే కల్యాణికి ఇప్పుడు తెలిసొచ్చింది. ప్రాంక్ పేరుతో ఓ యూట్యూబర్ అశ్లీల వీడియోలను చేస్తూ, సమాజాన్ని చెడు మార్గంలో నడిపిస్తున్నాడని, బాధ్యత గల భారతీయురాలినంటూ కరాటే కల్యాణి సంస్కరణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూట్యూబర్- కరాటే కల్యాణి, ఆమె అనుచరుల మధ్య పరస్పరం దాడులు చోటు చేసుకున్నాయి.
వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. తన పట్ల సీఐ అగౌరవంగా వ్యవహరించారని కరాటే కల్యాణి మీడియా ముఖంగా వాపోయారు. ఇదిలా వుంటే కల్యాణి అక్రమంగా పాపను దత్తత తీసుకున్నారంటూ 1098కు ఎవరో ఫిర్యాదు చేశారు. దీంతో దత్తపుత్రిక వ్యవహారం వివాదాస్పదమైంది. ఫిర్యాదు నేపథ్యంలో చైల్ట్ లైన్ ప్రొటెక్షన్ స్కీం అధికారులు కల్యాణి ఇంటికి వెళ్లారు.
అయితే అధికారులు వెళ్లిన సమయానికి కల్యాణి, ఆమె దత్త పుత్రిక ఇంట్లో లేనట్టు సమాచారం. దీంతో కల్యాణి తల్లి విజయలక్ష్మి, సోదరుడిని అధికారులు విచారిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ జంటకు మూడోసారి ఆడశిశువు పుట్టిందని, తెలిసిన వాళ్ల ద్వారా పాపను తెచ్చుకుని పెంచుకుంటున్నట్టు చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ అధికారులకు కల్యాణి తల్లి చెప్పినట్టు సమాచారం.
పిల్లలను దత్తత తీసుకోవాలంటే చట్టపరంగా చాలా నిబంధనలున్నాయి. వాటిని కల్యాణి పాటించారా? లేదా? అనే దానిపై ఈ వివాదానికి పరిష్కారం వుంటుంది. అశ్లీల వీడియోలపై చట్టపరంగా ఫిర్యాదు చేసి వుంటే కల్యాణికి ప్రస్తుతం ఈ సమస్య తలెత్తేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనవసరంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చైల్డ్ లైన్ అధికారులకు ఫిర్యాదు వెనుక ఇటీవల చోటు చేసుకున్న ఘటన కారణమై వుంటుందంటే కాదనగలమా?