జనసేనాని పవన్‌కల్యాణ్‌కు విజయవాడ ఎంపీ, సీనియర్ టీడీపీ నాయకుడు కేశినేని నాని పరోక్షంగా చీవాట్లు పెట్టారు. వాలంటీర్లపై పవన్‌కల్యాణ్ అవాకులు చెవాకులు పేలుతుండడం తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
వాలంటరీ వ్యవస్థ అనేది రాజకీయాలకు అతీతంగా పని చేయాలని సూచించారు. ఏ వ్యవస్థ అయినా పొలిటికల్ టర్న్ తీసుకోకపోతే బాగుంటుందన్నారు. వాలంటరీ వ్యవస్థ కూడా పొలిటికల్ వ్యవస్థ కాకపోతే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవన్నారు. ఇప్పుడు వాటి స్థానంలో వాలంటీర్లున్నారన్నారు. ఇద్దరికీ పెద్ద తేడా లేదని ఆయన చెప్పారు.
అయితే ఏ వ్యవస్థలో అయినా మంచీచెడూ రెండూ వుంటాయన్నారు. నలుగురైదుగురు చెడ్డవారున్నంత మాత్రాన మొత్తం వ్యవస్థను ఒకే గాట కట్టేయడం మంచిది కాదని ఆయన పరోక్షంగా పవన్‌కల్యాణ్‌కు హితవు చెప్పారు. అధికారులైనా ఎంపీలైనా, వాలంటీర్లైనా పార్టీలకు అతీతంగా పని చేయాలని కేశినేని నాని సూచించారు. వాలంటరీ వ్యవస్థ బాగుంటే కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
టీడీపీ అధిష్టానంపై గత కొంత కాలంగా కేశినేని నాని అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో కేశినేని నాని సానుకూల ధోరణిలో మాట్లాడ్డం చర్చనీయాంశమైంది. పవన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, ఆయన రేకెత్తించిన వివాదంపై నాని సందర్భోచిత కామెంట్స్ చేయడం విశేషం. వాలంటీర్ల వ్యవస్థపై ఎక్కడా ఆయన నోరు పారేసుకోలేదు. ఎలా వుండాలో ఆయన చెప్పుకొచ్చారు. ఇది పవన్‌కు చురకలు అంటించడమే అంటున్నారు.