సొంత పార్టీ నేతలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి ఫైర్ అయ్యారు. ఇటీవల కాలంలో కేశినేని వ్యవహార శైలి టీడీపీకి తలనొప్పిగా మారింది. వైసీపీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండడంతో పాటు వారిపై ప్రశంసలు, సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తుండడాన్ని టీడీపీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు వాటర్ ట్యాంక్‌లను పంపే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పార్లమెంట్ పరిధిలోని గొట్టంగాళ్ల విజయం కోసం కూడా పని చేస్తున్నట్టు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయం కేశినేని భవన్‌లో గొట్టంగాళ్ల ఫొటోలు పెట్టినట్టు ఆయన ప్లెక్సీలను చూపడం గమనార్హం. (ఈ ప్లెక్సీల్లో బొండా ఉమా, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరుల ఫొటోలున్నాయి)
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లంటే గొట్టంగాళ్లే అని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొందరు తనను గొట్టంగాడు అని అన్నారని ఆయన గుర్తు చేశారు. మంచి చేసే నాయకులనే ప్రజలు, పార్టీలు కోరుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాసేవ చేసే నాయకులకు వేరే పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయన్నారు. వైసీపీ సహా అన్ని పార్టీల నేతలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన అన్నారు. వేరే పార్టీల ఆఫర్లపై తానింకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
పొమ్మనకుండా పొగ పెడుతున్నారా? అనే ప్రశ్నకు కేశినేని నాని స్పందిస్తూ… ఆ మంట వందశాతం చేరుకుంటే ఆఫర్లపై ఆలోచిస్తానన్నారు. మహానాడుకు తనను ఆహ్వానించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మహానాడుకు వెళ్లలేదన్నారు. తాను టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిని, అధికార ప్రతినిధిని కానని చెప్పారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ఆయన పీఏ ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్లానన్నారు. కానీ అమిత్ షాతో ఏం మాట్లాడారో తనకు తెలియదన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయం ప్రారంభానికి కూడా పిలవకుండా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని కేశినేని నాని ప్రశ్నించారు.