ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. తొలి నుంచి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నదని, జీవితంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని తాను ఎన్నడూ అనుకోనేలేదని ఈ సందర్భంగా కిరణ్ వెల్లడించారు. అది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని నామమాత్రపు అస్తిత్వం ఉన్న భారతీయ జనతా పార్టీలో ఒకనాటి ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు చేరుతారని ప్రజలు కూడా ఎవ్వరూ అంచనా వేయలేదు. అయితే నల్లారి వారికి అంతకుమించి వేరే మార్గం కనిపించినట్లు లేదు.
అయితే ఇది రాజకీయం గనుక.. ఆయన చేరిక ఎవరికి ఎంత లాభం అనే కోణంలో పరిశీలిస్తే రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ కొద్ది సమయంలోనే సమర్థుడైన, ధైర్యం ఉన్న ముఖ్యమంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తన సొంత ప్రాంతానికి మేలు చేయడంలో ముందు వెనుక చూడకుండా నిధులు కేటాయించడం, సంస్థలను తీసుకురావడం ద్వారా- ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నీతిని పాటించారు. ఆ రకంగా చిత్తూరు జిల్లా పడమటి మండలాలలో నల్లారి వారి అభివృద్ధి ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే వర్తమాన రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఎంత మేర ప్రభావం చూపిస్తారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగానే ఎదగాలని కలలుకంటున్న భారతీయ జనతా పార్టీకి ఆయన ఎంత మేరకు ఉపయోగపడతారు అనేది ఒక ప్రశ్న. రాష్ట్రం విడిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చెప్పు గుర్తుతో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమంది సీనియర్ కీలక నాయకులు ఆయన వెంట ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది జీరో అయిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో వారందరూ కూడా రాజకీయ అస్తిత్వం కోసం తాపత్రయపడుతున్నారు. వాళ్ళందరూ సీనియర్లు మంచి హోదాలలో బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు! ఇప్పుడు కిరణ్ బిజెపిలో చేరిన తర్వాత, ఆయన జట్టుగా- వారిలో కొందరు కమలదళంలోకి వచ్చినా సరే ఆ పార్టీకి చాలా లాభం వాటిల్లినట్టే! అదే సమయంలో ఏపీలో భారతీయ జనతా పార్టీ కుల సమీకరణలపరంగా సమతూకం లేని స్థితిలో ఉంది.
గత, ప్రస్తుత సారధుల ను గమనిస్తే కాపు వర్గానికే పెద్ద పీట వేస్తోందనే అభిప్రాయం జనానికి ఏర్పడుతోంది. అలాంటప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి కిరణ్ రావడం వారికి ఒక అదనపు బలం. ఆ వర్గం నుంచి ఆల్రెడీ కొందరు ఉన్నప్పటికీ.. కిరణ్ చేరిక వలన ఒనగూరే ప్రయోజనం వేరు అని వారు భావిస్తున్నారు!
మరి బిజెపి ద్వారా కిరణ్ కు ఏం దక్కుతుంది. రాబోయే ఎన్నికలలో ఆయన తన సొంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగే ప్రయత్నం చేస్తారా? అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన తన సోదరుడితోనే తలపడి తొడ కొడతారా? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి జవాబు లేదు!
ఒకవేళ బిజెపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచినా సరే.. ఉమ్మడి రాష్ట్రానికే సీఎం గా చేసిన వ్యక్తి విభజిత రాష్ట్రంలో ఎమ్మెల్యేగా కూర్చోవడం ఆయనకు చిన్నతనం అనిపిస్తుంది. ఆయన కేవలం కేంద్ర రాజకీయాల మీద మాత్రమే ఆశపెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
రాజ్యసభ సభ్యుడి హామీతోనే ఆయనను కమలదళం తమలో చేర్చుకున్నట్టుగా కూడా వినవస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటిదాకా నిశ్శబ్దాన్ని మాత్రమే పాటించిన నల్లారి కిరణ్ నుంచి రాబోయే రోజుల్లో కపటం లేని రాజకీయ వైఖరులను చూడవచ్చునని ప్రజలు భావిస్తున్నారు.