ఒక వైపు అమరావతి పాదయాత్ర తాత్కాలికంగా ఆగిపోవడం, మరోవైపు ఉత్తరాంధ్ర, సీమాంధ్ర ఉద్యమాలకు కార్యాచరణలు సిద్ధం కావడం చర్చనీయాంశమవుతున్నాయి. అమరావతి పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా ఎదురు దాడి చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ కొంత వరకూ విజయం సాధించింది. ఇదిలా వుండగా, అమరావతి పాదయాత్రపై నిర్వాహకుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి.
హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వున్నప్పుడు మళ్లీ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏంటని అమరావతి పోరాటకర్తల్లో మెజార్టీ వాదన. కేవలం విరాళాల వసూళ్లు, ఆ సొమ్ముతో సొంతిళ్లను చక్కదిద్దుకునేందుకే కొందరు ఉద్యమాన్ని వాడుకుంటున్నారనే తీవ్ర విమర్శలు సొంతవారి నుంచే ఎదురవుతున్నాయి. దీన్ని ఎవరూ కాదనలేని నగ్న సత్యం. కొందరి స్వార్థానికి అనవసరంగా ఉత్తరాంధ్ర, సీమాంధ్రులను రెచ్చగొట్టి అటు వైపు నుంచి ప్రతిఘటన ఎదురు కావడానికి తామే కారణమయ్యామనే ఆవేదన, అంతర్మథనం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అమరావతి పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటమని విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం తమ ఆస్తుల విలువే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని కొడాలి నాని విరుచుకుపడ్డారు.
చంద్రబాబునాయుడు సృష్టించిన మాయా లోకమే భ్రమరావతి అని కొడాలి ఘాటు విమర్శ చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రజలంతా బాగుండాలని సీఎం జగన్ కోరుకుంటుంటే, తాము మాత్రమే బాగుండాలని అమరావతి రైతులు విచిత్రంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.