వచ్చే ఎన్నికల్లో కుప్పంలో మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఓడిస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిన బూని ఉంది. మామూలుగా అయితే ఇలాంటి సవాళ్లు మామూలే అనుకోవచ్చు. అయితే 2019 ఎన్నికల్లోనే కుప్పంలో చంద్రబాబునాయుడి మెజారిటీ సగానికి సగం తగ్గిపోయింది. తొలి రెండు రౌండ్ల కౌంటింగ్ లో అయితే చంద్రబాబు నాయుడు వెనుకబడ్డారు కూడా! ఇలా కుప్పంలో చంద్రబాబు నాయుడుకు అప్పట్లోనే చాలా డ్యామేజ్ జరిగింది.
ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించినట్టుగా ప్రకటించినప్పటికీ, అప్పటికే నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులను కూడా చంద్రబాబు నాయుడు జనాలకు పరిచయం చేశారు. ఆ తర్వాత బహిష్కరణ డ్రామా తెరపైకి వచ్చింది. ఇక తొలిసారి కుప్పాన్ని మునిసిపాలిటీగా చేసి, దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేశారు. ఇలాంటి నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు ఓటమే లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పని చేస్తూ ఉంది.
దీంతో చంద్రబాబు ధోరణి మార్చారు. అప్పటి వరకూ కుప్పానికి ఏడాదికోసారి పర్యటించని చంద్రబాబు నాయుడు. గత రెండేళ్లలో వరస పెట్టి కుప్పం పర్యటనలు పెట్టుకుంటున్నారు. అక్కడ పార్టీ తరఫున బాధ్యులను నియమించారు. ఒకరికి ఇద్దరిని నియమించారు. కార్యవర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. చంద్రబాబును ఓడించడమే లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకుంటూ ఉంటే, చంద్రబాబు మాత్రం తనకు ఎసరు రాకుండా చాలానే కష్టపడుతున్నారు.
అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా తగ్గడం లేదు. చంద్రబాబుకు ఓటమే అంటోంది. ఇటీవలి చిత్తూరు పర్యటనతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జగన్ పర్యటనకు చంద్రబాబు సొంత జిల్లాలో వచ్చిన స్పందన తర్వాత అర్జెంటుగా చంద్రబాబు మరోసారి కుప్పం పర్యటన పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందని, ఎప్పటికప్పుడు కుప్పం చుట్టూ తిరుగుతూ చంద్రబాబు నాయుడు తన గెలుపుపై సందేహాలను మరింతగా రేగకుండా చూసుకోవాల్సి ఉందేమో!