వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గెలికారు. అసలే వర్మకు చంద్రబాబు, లోకేశ్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకే వాళ్లిద్దరిపై అప్పుడప్పులు సెటైర్స్ విసురుతుంటారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి చంద్రబాబుతో పాటు లోకేశ్‌పై వ్యంగ్య కామెంట్స్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్‌పై వర్మ వ్యూహం పేరుతో సినిమా తీస్తున్నారు.
కొంత కాలం క్రితం సినిమాపై చర్చించేందుకు సీఎం జగన్‌తో వర్మ భేటీ అయిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్‌పై లోకేశ్ తాజాగా విమర్శలు గుప్పించారు. ఇవాళ గవర్నర్‌ను లోకేశ్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా మేడిన్ ఏపీ అంటున్నారని విమర్శించారు. ఆర్జీవీ తీసే సినిమాపై సమీక్షించడానికి జగన్‌కు సమయం ఉందని, గంజాయి నివారణ చర్యలు చేపట్టడానికి లేదా? అని లోకేశ్ ప్రశ్నించారు.
ప్రత్యేకంగా వర్మ పేరును లోకేశ్ ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేశ్‌ను వర్మ ఊరికే విడిచి పెట్టరనే చర్చకు తెరలేచింది. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసే సందర్భంలో టీడీపీ నేతలు, వర్మ మధ్య ఓ రేంజ్లో డైలాగ్ వార్ నడిచిన సంగతుల్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరని గతంలో సీఎం హోదాలో చంద్రబాబు అన్నారు. దానికి వర్మ తన మార్క్ చురకలు అంటించారు. అందుకే కదా జరిగిన నిజాలనే తీస్తున్నానంటూ వర్మ చీవాట్లు పెట్టారు. అలాగే ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకమని బాబు అంటే, ఆ పుస్తకంలో చిరిగిపోయిన లేదా చించేసిన చాలా పేజీలను తిరిగి అతికిస్తా అని వర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే.
ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తెరకెక్కిస్తే వర్మ ఇంటి ఎదుట ధర్నా చేస్తానని సినీ నటి వాణీ విశ్వనాథ్ వార్నింగ్ ఇవ్వగా… నాకసలు ఇల్లే లేదని, అందుకే రోడ్ల మీద తిరుగుతుంటానని సమాధానం ఇచ్చారు. తనను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమలిపోతామని వాణీ విశ్వనాథ్‌పై తనదైన ప్రేమ, జాలి చూపిన సంగతి తెలిసిందే. వర్మతో పెట్టుకుంటే ఎలా వుంటుందో చెప్పడానికే ఈ ఉదాహరణలు. తాజాగా లోకేశ్‌పై వర్మ రియాక్షన్ ఆసక్తి కలిగిస్తోంది.