లోకేశ్‌కు బుర్ర పని చేస్తున్నట్టు లేదు. లోకేశ్ ఏం మాట్లాడకపోతేనే కాస్త గౌరవం, మర్యాద దక్కేలా ఉన్నాయి. గుప్పిట మూసినంత వరకే రహస్యం. తెరిస్తే, అటోఇటో ఏదో ఒకటి అవుతుంది. ప్రస్తుతం లోకేశ్ బుర్ర అనే గుప్పిట మూసి వుంటే టీడీపీకి, చంద్రబాబుకు బాగుంటుంది. లేదంటే టీడీపీ పరువు కాస్త గంగలో కలిసిపోతుంది.
ఏ మాత్రం సంబంధం లేని, రాజకీయంగా నయా పైసా ప్రయోజనం కలిగించని అంశాల్ని లోకేశ్ ఎందుకు ప్రస్తావిస్తున్నారో ఆయనకే తెలియాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి విమర్శించాలంటే రాజకీయంగా ఎన్నో అంశాలున్నాయి. అవేవీ కాదని తాను ఏడాదిన్నర క్రితం తిరుమలలో ప్రమాణం చేశానని, నువ్విప్పుడు అక్కడే ఉన్నావు కాబట్టి చేయాలని జగన్‌ను కోరడం లోకేశ్ అజ్ఞానానికి మచ్చు తునక.
లోకేశ్‌ను అభాసుపాలు చేస్తున్న ట్వీట్ గురించి తెలుసుకుందాం.
‘వివేకా హత్యతో నాకు, నా కుటుంబానికీ ఎలాంటి సంబంధమూ లేదని 2021, ఏప్రిల్ 14న వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. మీ బాబాయ్ వివేకా హత్యతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా జగన్‌రెడ్డీ?’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. తిరుమల వెళ్తున్న జగన్ ప్రమాణం చేస్తారా? లేక ‘బాబాయ్‌పై గొడ్డలి పోటు.. జగనాసుర రక్త చరిత్ర’ అని ఒప్పుకుంటారా? అని లోకేశ్ ప్రశ్నించడం గమనార్హం.
మాజీ మంత్రి వివేకా హత్యపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది. దోషులెవరో దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ తేల్చుతుంది. సీబీఐ పవర్ ఏంటో గత సార్వత్రిక ఎన్నికల ముందు… ఆ సంస్థను ఏపీలో అడుగు పెట్టకుండా నిషేధించిన టీడీపీ నేతలకు బాగా తెలుసు. ప్రమాణం చేయాల్సి వస్తే… ఎన్టీఆర్‌కు తన తండ్రి చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదని చేయగలరా? అని సోషల్ మీడియాలో లోకేశ్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.
ఏదో ఒకటి ప్రశ్నించాలి, విమర్శించాలనే ఆత్రుతలో లోకేశ్ తప్పులో కాలేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి బుర్ర ఉన్న లోకేశ్ రానున్న కాలంలో టీడీపీని ఎలా నడిపిస్తారో? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.