టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర ఇవాళ్టికి మూడో రోజు చేరుకుంది. లోకేశ్ పాదయాత్ర అంటే టీడీపీ శ్రేణులకి పైకి చెప్పుకోలేని భయం. టీడీపీ నేతలు, కార్యకర్తలు భయపడుతున్నట్టే… పాదయాత్రలో లోకేశ్ తన అజ్ఞానాన్ని, అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌పై లోకేశ్ వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
పాదయాత్ర రెండో రోజు పర్యటనలో లోకేశ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తే, చంద్రబాబు 34 శాతానికి పెంచారని లోకేశ్ అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించిన ఏకైక సీఎం జగన్ అని ఆయన విమర్శిం చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్లను తిరిగి 34 శాతానికి తెస్తామని ఆయన అన్నారు. సామాజిక సమీకరణల్లో జగన్ దరిదాపుల్లో కూడా టీడీపీ లేదనేది మేధావుల మాట.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతానికి పైగా సీట్లు ఇవ్వడంతో పాటు అధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత జగన్‌ది. చివరికి ఓసీలకు కేటాయించిన చోట కూడా బీసీలకు పదవులు కట్టబెట్టి వారి ఆదరణను చూరగొన్నారు. ఉదాహరణకు తిరుపతి మేయర్ పీఠం ఓసీకి కేటాయించారు. కానీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శిరీషకు మేయర్ పదవి దక్కింది. ఇలాంటివి చిన్నాపెద్ద పదవులు ఎన్నో బీసీ నేతలకు జగన్ ప్రభుత్వం కేటాయించింది.
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో బీసీల్లో ఏ కులం వారు అత్యధిక జనాభా వుంటారో, వారికే పదవులు కట్టబెట్టిన ఘనత జగన్ సర్కార్‌దే. ఇదే విధంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో కూడా చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళకు మున్సిపల్ చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించారు. ఇలాంటివన్నీ తెలుసుకుని లోకేశ్ మాట్లాడితే మంచిది. ఒకవైపు జగన్ 50 శాతానికి పైగా బీసీలకు పదవులు ఇచ్చి, టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండి కొట్టారు.
లోకేశ్ మాత్రం ఇంకా 34 శాతం రిజర్వేషన్‌ను తీసుకొస్తామని చెబుతూ, బీసీలను వెనక్కి తీసుకెళ్తామని చెప్పడంతో టీడీపీ ఖంగుతింటోంది. ఇలాగైతే లోకేశ్ పాదయాత్ర వల్ల అసలుకే ఎసరు వచ్చేలా వుందని టీడీపీ భయాందోళనలో వుంది.