టీడీపీ యువ కిశోరం నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ఏ మాత్రం స్పందన లేదనే అభిప్రాయానికి టీడీపీ వచ్చింది. లోకేశ్ పాదయాత్రకు ఈ స్థాయిలో నిరాదరణ ఎదురవుతుందని చివరికి అధికార పక్షం కూడా ఊహించలేదు. అందుకే లోకేశ్ పాదయాత్రకు అధికార పార్టీ నుంచి ఏ మాత్రం అడ్డంకులు ఎదురు కాలేదు. యువగళాన్ని పట్టించుకునే దిక్కే లేకుండా పోవడంతో లోకేశ్‌కు ప్రచారం లభించలేదు.
ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతులు లోకేశ్ పాదయాత్ర ఎందుకు అట్టర్ ప్లాప్ అయ్యిందో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ఇది వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై టీడీపీ కలవరాని గురవుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తేనే తిరిగి అమరావతి ఊపిరి పోసుకుంటుందని వారు ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారు పెట్టిన పోస్టు కావడంతో టీడీపీకి దిక్కుతోచడం లేదు. లోకేశ్ పాదయాత్రకు అట్టర్ ప్లాప్ కావడానికి కఠిన చేదు నిజాల్ని వారు నిర్భయంగా వెల్లడించారు. ఆ పోస్టులోని ప్రాధాన్య అంశాల గురించి తెలుసుకుందాం.
“లోకేశ్ పాదయాత్రకు అమరావతి రైతుల ఉసురు తగిలిందని, అందుకే పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయిందని రెండు రోజులుగా మన అమరావతి గ్రూపుల్లో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు పెట్టిన వారి మనసులోని బాధను మనందరం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే లోకేశ్ పాదయాత్రని ప్రమోట్ చేసుకోవటానికి మన అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్రను చంద్రబాబు గారు ఆపించారు”
లోకేశ్ పాదయాత్ర కోసం అమరావతి రెండో విడత పాదయాత్రను చంద్రబాబు ఆపించారని మొట్టమొదట “గేట్ ఆంధ్ర” రాసిన సంగతి తెలిసిందే. అదే వాస్తవాన్ని ఇప్పుడు వారు చెబుతుండడం గమనార్హం. అరసవెల్లి వరకూ చేపట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుందన్న ప్రచారంలో అర్ధ సత్యం మాత్రమే ఉంది. ఆ తర్వాత హైకోర్టు అనుమతి ఇచ్చినా పాదయాత్ర ఊసే ఎత్తలేదు. చివరికి తిరుపతిరావు ఒక్కడే ఇటీవల పాదయాత్రను పూర్తి చేసి, మొక్కు తీర్చుకున్నారు. ఈ నేపథ్యంలో అరసవెల్లి సూర్యనారాయణ ఆలయం వరకూ చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడం వల్లే, ఆ దేవుడు శాపానికి గురై లోకేశ్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయ్యిందనేది అమరావతి రైతుల భావన.
“ప్రస్తుతం మనం చేయగలిగిందేమీ లేదు. చంద్రబాబు ఎలాంటి వాడైనా మనకిప్పుడు తెలుగుదేశమే దిక్కు. కాబట్టి లోకేశ్ పాదయాత్రకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టొద్దు. మన శిబిరాల్లో కూడా దయచేసి చంద్రబాబుని తిట్టడాన్ని ఏ ఒక్కరూ ప్రోత్సహించవద్దు. మనం మరో సంవత్సరం పోరాడాలి. దయచేసి ఓపిక పట్టండి. న్యాయస్థానంలో మనం గెలుస్తాం. జై అమరావతి”
ఇలాంటి పోస్టులను టీడీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో పెడుతున్నారంటే, వారెంతగా చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు పాపాల వల్ల లోకేశ్ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందనేది వారి సోషల్ మీడియా పోస్టుల సారాంశం. లోకేశ్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయ్యిందనేది మాత్రం అందరూ అంగీకరించే వాస్తవం.