కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రెడ్‌బుక్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ రెడ్‌బుక్ పాపులర్ అయిన సంగతి తెలిసింతే.
టీడీపీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టిన ప్రత్యర్థులు, అలాగే వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఇప్పుడిప్పుడే పాలన ఒక బాటలో పడుతోంది. దీంతో ఎక్కడికక్కడ రెడ్‌బుక్ జాబితాను బయటికి తీస్తున్నారు.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చిన్నాపెద్దా ఉద్యోగులనే తేడా లేకుండా, ఏఏ విభాగాల్లో వైసీపీ అనుకూలురు ఉన్నారో వాళ్ల జాబితా తయారు చేసే పనిలో కూటమి నేతలున్నారు. కూటమి అనుకూల అధికారులు తమకు గిట్టని, అలాగే వైసీపీ అనుకూలమనే పేరుతో ఉద్యోగుల జాబితాను తయారు చేస్తున్నారని తెలిసింది. దీంతో వైసీపీ అనుకూల ముద్రపడ్డ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడమో, లేక ఏదో ఒక సాకుతో సస్పెన్షన్ వేటు వేస్తారని కొందరు ఉద్యోగులు భయపడుతున్నారు. మరికొందరు ఉద్యోగులు బదిలీ ఎక్కడికి చేసినా, వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఏం చేసినా ఉద్యోగం నుంచి తొలగించలేరు కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే త్వరగా కూటమి ఉద్యోగుల్లో వ్యతిరేకత తెచ్చుకుంటుందనే చర్చకు తెరలేచింది.