మామూలుగానే నారా లోకేష్ వాక్పటిమ గురించి వేరే చెప్పనక్కర్లేదు. నిన్నలా మొన్న కూడా… ఇంటింటికీ తిరిగి చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం గురించి వివరించి చెబుతామంటూ తన మార్కు ఆణిముత్యం ఒకటి వదిలారు!
అహంకారపూర్వకమైన మాటలు, అసభ్యకరమైన సైగలు, వార్నింగులు చేస్తూ.. సీఎం హోదాలోని వ్యక్తిని పట్టుకుని అరేయ్, తురేయ్ అంటూ కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయిన ఈ మాజీ సీఎం తనయుడు తనకు మించినోడు లేడంటూ రోడ్లలో వీరంగాలు వేశారు! ఎర్రబుక్కు, హెచ్చరికలు, అధికారంలోకి వస్తే మీ పని పడతా.. అంటూ మహత్యం అధికారం చేతిలో ఉంది తప్ప తన చేతిలో ఏమీ లేదని బాహాటంగా క్లారిటీ ఇచ్చాడు. రేపటి ఎన్నికల్లో తన పగ, ప్రతీకారాల కోసం అధికారం ఇవ్వాలి తప్ప ప్రజలు వేరే ఎక్స్ పెక్టేషన్లు పెట్టుకోవద్దని కూడా లోకేసుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు!
మరి అలాంటి లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో సీఐడీ విచారణలో.. తెలీదు, గుర్తులేదు, మరిచిపోయా.. అనే మాటల బాట పట్టినట్టుగా ఉన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు విషయంలో.. హెరిటేజ్ భూములకు, లింగమనేనికి లబ్ధి గురించి సీఐడీ సూటిగా ప్రశ్నలు అడిగినా లోకేష్ తెలీదు, గుర్తులేదు, మరిచిపోయే అనే ధోరణిని కనబరిచారని తెలుస్తోంది!
రింగ్ రోడ్ అలైన్ మెంట్ కు అనుగుణంగా హెరిటేజ్ భూములు కొనుగోలు చేయడంపై లోకేష్ ను సీఐడీ ప్రశ్నలు అడగ్గా.. ఈ విషయం తనకు తెలీదని సమాధానం ఇచ్చారట! అయితే ఆ భూములు కొనుగోలు గురించి జరిగిన హెరిటేజ్ డైరెక్టర్ల సమావేశంలో లోకేష్ పాల్గొన్న వైనాన్ని, మినిట్స్ లో తను కూడా సంతకం చేసిన వైనాన్ని సీఐడీ అధికారులు ప్రశ్నించగా.. లోకేష్ బిత్తర చూపులకు పరిమితం అయిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
దీనిపై సమాధానం చెప్పడానికి తన లాయర్ల సహాయం అవసరమని లోకేష్ సీఐడీ అధికారులకు చెప్పగా, వారు దానికి అనుమతిని ఇచ్చారట. చివరకు హెరిటేజ్ డైరెక్టర్ల సమావేశంలో చాలా నిర్ణయాలు తీసుకున్నారని, అందులో అన్నింటిపై తనకు అవగాహన లేదంటూ సమాధానం ఇచ్చారట! ఇదీ ఎర్రబుక్కు నారా వారబ్బాయి వ్యవహారం!
నారా లోకేష్ పై సీఐడీ విచారణ అప్పుడే ముగిసిపోలేదు. ఆయనను సీఐడీ మరోసారి ఆహ్వానించింది. ఇదంత అర్రీబుర్రీగా తేలే వ్యవహారంలా అయితే కనపడటం లేదు!