టికెట్ దక్కలేదని అలక వహించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు పార్టీ వెంటే నడిచేందుకు నిర్ణయించుకున్నారు. విజయవాడ సెంట్రల్‌లో విష్ణుకు వ్యతిరేకంగా సర్వే నివేదికలు వచ్చాయనే కారణంతో ఆయన్ను పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను సెంట్రల్‌కు సీఎం జగన్ బదిలీ చేశారు. దీంతో విష్ణు కినుక వహించారు.
కొన్ని రోజుల పాటు ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలకు విష్ణు దూరంగా ఉన్నారు. విష్ణును వెల్లంపల్లి కలిసి తనకు సహకరించాలని కోరారు. అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. విష్ణు సహకరించకపోతే, విజయవాడ సెంట్రల్‌లో తాను ఏమీ చేయలేనని సీఎం జగన్‌కు వెల్లంపల్లి మొరపెట్టుకున్నారు.
దీంతో వైసీపీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి విష్ణును బుజ్జగించారు. ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు కానీ, విష్ణు మాత్రం మళ్లీ యాక్టీవ్ అయ్యారు. టికెట్ దక్కకపోవడం లాంటివి రాజకీయాల్లో సహజమని ఆయన అన్నారు. స్నేహితుడైన వెల్లంపల్లికి సహకరించేందుకు విష్ణు అంగీకరించారు.
ఈ నెల 19న విజయవాడలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సన్నాహక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునలతో కలిసి మల్లాది విష్ణు కూడా పాల్గొనడం గమనార్హం.
విష్ణు మాట్లాడుతూ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఒక చరిత్రగా అభివర్ణించారు. సీఎం జగన్ ఆలోచన అభినందనీయమని ఆయన ప్రశంసలతో ముంచెత్తడం విశేషం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ప్రభుత్వం తమదని ఆయన అన్నారు. టికెట్ రాలేదనే షాక్ నుంచి కోలుకుని ఎప్పట్లా జగన్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేలా మల్లాది విష్ణు మాట్లాడ్డం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో వైసీపీ గెలుపు కోసం విష్ణు పని చేస్తారనే చర్చకు తెరలేచింది.