నా లవర్ నే పెళ్లి చేసుకుంటావా..? నీ అంతు చూస్తా

ప్రేమికులిద్దరూ విడిపోతారు. మధ్యలో మరొక స్నేహితుడు ఎంటరవుతాడు. మాజీ ప్రేయసి, తన స్నేహితుడితో క్లోజ్ గా ఉండటం చూసి మొదటి ప్రేమికుడికి పిచ్చెక్కిపోతుంది. ఆ ప్రతీకార జ్వాల వారి జీవితాలను మసి చేస్తుంది. ఇటీవల…

ప్రేమికులిద్దరూ విడిపోతారు. మధ్యలో మరొక స్నేహితుడు ఎంటరవుతాడు. మాజీ ప్రేయసి, తన స్నేహితుడితో క్లోజ్ గా ఉండటం చూసి మొదటి ప్రేమికుడికి పిచ్చెక్కిపోతుంది. ఆ ప్రతీకార జ్వాల వారి జీవితాలను మసి చేస్తుంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్ లో నవీన్ అనే స్నేహితుడిని దారుణంగా చంపి ముక్కలు ముక్కలు చేసిన హరిహరకృష్ణ ఉదంతం మరవకముందే తెనాలిలో అలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ కూడా నిందితుడు, బాధితుడు ఇద్దరూ ప్రాణ స్నేహితులు కావడం విశేషం. అయితే అక్కడ ఇద్దరికీ ఒకరే కామన్ లవర్ కాగా, ఇక్కడ ఒకరి ప్రేయసి, మరొకరికి భార్యగా మారడం అసలు ట్విస్ట్.

క్లుప్తంగా ఇదీ కథ..

తెనాలిలో గణేష్ బాబు, భాషా మంచి మిత్రులు. మతాలు వేరయినా స్నేహం వారిని దగ్గర చేసింది. నందులపేటకు చెందిన యువతిని భాషా ప్రేమించాడు. కొన్నాళ్లు వారి ప్రేమ వ్యవహారం బాగానే నడిచింది. స్వతహాగా దుడుకు స్వభావం ఉన్న భాషా 2018 డిసెంబర్ లో ఓ దాడి కేసులో అరెస్ట్ అయ్యాడు, జైలుకెళ్లాడు. 

భాషా జైలుకి వెళ్లడంతో సదరు యువతి మనసు మార్చుకుంది. భాషా స్నేహితుడైన గణేష్ బాబుతో చనువుగా ఉండసాగింది. వారిద్దరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకున్నారు. భాషా జైలులో ఉండగా ఇక్కడ పెళ్లి, కాపురం అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రైవేటు ఉపాధ్యాయుడైన గణేష్ బాబు, భార్యను ప్రేమగా చూసుకునేవాడు.

ఇటీవల భాషా జైలునుంచి తిరిగొచ్చాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్నాడు. తన ప్రేయసి, తన స్నేహితుడినే పెళ్లి చేసుకుందని, అదే కాలనీలో కాపురం ఉంటోందని తెలిసి రగిలిపోయాడు. గణేష్ బాబుపై కోపం పెంచుకున్నాడు. అదను కోసం వేచి చూశాడు.

స్నేహితులైన బాబి, అరవింద్ తో కలసి భాషా మర్డర్ స్కెచ్ వేశాడు. గణేష్ బాబు గొంతుకోసి హత్య చేయబోయాడు. తప్పించుకున్న గణేష్ పారిపోయి ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భాషాతోపాటు అరవింద్, బాబిపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురూ గణేష్ కి స్నేహితులే కావడం విశేషం. 

రాత్రి ఇంటికి వచ్చి బయటకు వెళ్దాంరా అంటూ గణేష్ ని పిలవడంతో అమాయకంగా వారి వెంట వెళ్లాడు. గొంతు కోసేందుకు ప్రయత్నించడంతో అసలు విషయం బయటపడింది. చివరకు గణేష్ ప్రాణాలకు ప్రమాదం లేదని తేలడంతో ఈ కథ నవీన్-హరిహరకృష్ణ స్టోరీలాగా విషాదాంతం కాలేదు. కానీ ఒకే అమ్మాయిన స్నేహితులిద్దరూ ఇష్టపడటం, ఆమె ఇద్దరికీ మనసివ్వడం, చివరిగా ఒకరికే దగ్గరవడం, ఆమె వ్యవహారంతో స్నేహితులిద్దరూ శత్రువులుగా మారడం ఈ కథల్లో కామన్ పాయింట్.