ఒంగోలు ఎంపీ, వైసీపీ సీనియర్ నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి బెయిల్ లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీంతో రాఘవరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్నానని, బెయిల్ మంజూరు చేయాలని మరోసారి ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈడీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఆయనకు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్లాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇందుకు ఆయన అంగీకరించారు.
ఢిల్లీ లేదా చెన్నై కార్యాలయాల్లో విచారణకు హాజరుకావచ్చని హైకోర్టు తెలిపింది. అలాగే చెన్నై విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు షరతు విధించడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
కవితను అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం అంగీకారానికి వచ్చాయనే ఆరోపణ కాంగ్రెస్ నుంచి వస్తోంది. అందుకే కవితను అరెస్ట్ చేయలేదనే ప్రచారం తెలంగాణలో విస్తృతంగా సాగుతోంది.