త‌ల్లిదండ్రుల కూల్ కూల్‌…!

మ‌ణిపూర్‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల త‌ల్లిదండ్రులు కూల్ అయ్యారు. తెలుగు విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న త‌గ్గింది. ఇవాళ త‌మ పిల్ల‌లు ఇళ్ల‌కు చేరుతార‌నే న‌మ్మ‌కం వారిలో ఏర్ప‌డింది.…

మ‌ణిపూర్‌లో చ‌దువుకుంటున్న విద్యార్థుల త‌ల్లిదండ్రులు కూల్ అయ్యారు. తెలుగు విద్యార్థుల‌ను త‌ర‌లించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న త‌గ్గింది. ఇవాళ త‌మ పిల్ల‌లు ఇళ్ల‌కు చేరుతార‌నే న‌మ్మ‌కం వారిలో ఏర్ప‌డింది. మణిపూర్‌లో చెలరేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌తో ఆ రాష్ట్రం అట్టుడికిపోతోంది. దీంతో అక్క‌డి ప్ర‌జానీకం భ‌యంతో వ‌ణికిపోతోంది.

మ‌ణిపూర్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల ప్ర‌భావం అక్క‌డ చ‌దువుకుంటున్న తెలుగు విద్యార్థుల‌పై కూడా ప‌డింది. ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యం లేక‌పోవడం, ఇత‌ర‌త్రా క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన‌డంతో త‌ల్లిదండ్రుల‌తో పిల్ల‌లు మాట్లాడ‌లేని దుస్థితి. దీంతో ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యంలో విద్యార్థుల్లో, మ‌రోవైపు త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు త‌మ పిల్ల‌ల్ని సుర‌క్షితంగా ఇళ్ల‌కు చేర్చేందుకు స‌త్వ‌రం చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

ఈ క్ర‌మంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు మూడు లేదా నాలుగు ప్ర‌త్యేక విమానాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు స‌మాచారం. ఇంపాల్ నుంచి మూడు విమానాల్లో ఆంధ్రా, తెలంగాణ విద్యార్థుల‌ను హైద‌రాబాద్‌కు త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. అలాగే ఇంపాల్ నుంచి కోల్‌క‌తాకు మ‌రో విమానాన్ని ఏర్పాటు చేశారు. అక్క‌డి నుంచి విద్యార్థుల‌ను ఆంధ్రాకు త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. విద్యార్థుల‌ను త‌ర‌లించే విష‌య‌మై రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్నారు.

హైద‌రాబాద్ విమానాశ్ర‌యానికి త‌ల్లిదండ్రులెవ‌రూ రావ‌ద్ద‌ని అధికారులు విన్న‌వించారు. అక్క‌డి నుంచి నేరుగా ఆంధ్రాలోని మారుమూల ప్రాంతాల‌తో పాటు తెలంగాణ‌లోని స్వ‌స్థ‌లాల‌కు విద్యార్థుల‌ను చేర్చేందుకు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన సుమారు 300 మంది విద్యార్థులున్న‌ట్టు స‌మాచారం.